Police Alert In PLGA Week Celebrations: పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ వారోత్సవాల వేళ తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో అలజడి మొదలైంది. 2000 సంవత్సరం డిసెంబర్ 2న పీపుల్స్ వార్ పార్టీ.. పీఎల్‌జీఏను ఏర్పాటు చేసింది. అప్పటినుంచి మావోయిస్టు పార్టీకి ఇది రక్షణ కవచంగా ఉంటోంది. డిసెంబర్ 2 నుంచి 8 వరకు 22 వ వారోత్సవాలను నిర్వహిస్తుండటంతో దండకారణ్యంలో ఉత్కంఠ నెలకొంది. వారోత్సవాల విజయవంతానికి మావోయిస్టులు అన్ని విధాలా సన్నద్ధమవగా .. ఎలాగైనా తిప్పికొటేందుకు పోలీసులు, గ్రేహౌండ్స్ బలగాలు.. ప్రతి వ్యూహాలు రచించడంతో పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారింది.
యువతను ఆకర్షించి రిక్రూట్ చేసుకోవడం, మన్యం గ్రామాల్లో పట్టు పెంచుకుని క్యాడర్‌ను పెంచుకునేందుకే.. ఇటీవల పూజారి కాంకేర్ ఊట్లపల్లి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమైనట్లు తెలుస్తోంది. వారోత్సవాల వేళ పోలీసులు, కూంబింగ్ బలగాలు వారం నుంచి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ముందు జాగ్రత్తగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేశారు. మావోయిస్టుల కదలికలున్న ప్రాంతాలపై నిఘా పెంచారు.
పోలీసుల ముమ్మర తనిఖీలు: కొత్త వ్యక్తుల రాకపోకలపై దృష్టి సారించారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం ఏజెన్సీ ప్రాంతాల రహదారులపై పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. బస్సులు, ఇతర వాహనాల్లో సోదాలు చేస్తూ అనుమానితులను విచారిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అప్రమత్తమయ్యారు. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు వాహన తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. భద్రాచలం బస్‌స్టేషన్ నుంచి ఏజెన్సీ ప్రాంతాలకు సర్వీసులను నిలిపి వేశారు.
పోలీసులు, మావోయిస్టులకు ప్రకటనల యుద్ధం: ఈనెల 9 వరకు రోజూ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే బస్సులు నడుపుతామని అధికారులు తెలిపారు. దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, కుంట, చింతూరు, వీఆర్ పురం మండలాలకు వెళ్లే బస్ సర్వీసులు రాత్రి వేళలో ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల పోలీసులు, మావోయిస్టులకు ప్రకటనల యుద్ధం నడుస్తోంది. మావోయిస్టులే ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు, లేఖలు విడుదల చేస్తుండగా.. పోలీసులు సైతం అదే పంథాను అనుసరిస్తూ.. ఏజెన్సీ గ్రామాల ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఏజెన్సీ గ్రామాల ప్రగతికి అడ్డం పడుతున్నారని బెదిరింపులతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ పోలీసులు ప్రకటనలు విడుదల చేస్తున్నారు.
"చర్ల, వెంకటాపురం తిరుగుతున్న బస్సులను పోలీసుల ఆదేశాల మేరకు తక్కువగా తిప్పడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు బస్సులను నడపడుతున్నాం. దీనికి ప్రయాణికులు సహకరించాలని కోరుతున్నాం." -రామారావు, భద్రాచలం ఆర్టీసీ డీఎం
ఇవీ చదవండి: