Kamareddy Master Plan Canceled: మున్సిపల్ కార్యవర్గం అత్యవసర సమావేశంలో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ను రద్దు చేస్తూ కౌన్సిలర్లు తీర్మానాన్ని ఆమోదించారు. మాస్టర్ ప్లాన్ రద్దు కోసం ప్రత్యేకంగా సమావేశమైన కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. మాస్టర్ ప్లాన్ ముసాయిదా తాము రూపొందించింది కాదని కామారెెడ్డి మున్సిపల్ ఛైర్‌పర్సన్ జాహ్నవి తెలిపారు. ఉన్నతాధికారులకు తీర్మానం పంపుతామని పేర్కొన్నారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు.
'ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మాస్టర్ ప్లాన్ ముసాయిదా మేం రూపొందించింది కాదు. మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. ఉన్నతాధికారులకు తీర్మానం పంపుతాం. కన్సల్టెన్సీపై చర్యల కోసం ఫిర్యాదు చేస్తాం. రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.' - జాహ్నవి, కామారెడ్డి ఛైర్‌పర్సన్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ముసాయిదాను రద్దు చేస్తూ కౌన్సిలర్లు ఏకవాక్య తీర్మానం చేశారు. ఈ ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి ఛైర్‌పర్సన్ జాహ్నవి, కమిషనర్ దేవేందర్, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. మున్సిపాలిటీ మాస్టర్‌ప్లాన్, దిల్లీ కన్సల్టెన్సీ పంపిన మాస్టర్‌ప్లాన్ వేర్వేరని... మున్సిపల్ ఛైర్‌పర్సన్ జాహ్నవి నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. మాస్టర్‌ప్లాన్‌పై 60రోజుల్లో 2,396అభ్యంతరాలు వచ్చాయన్న ఆమె... రైతులకు వ్యతిరేకంగా ఎలాంటి చర్యలు తీసుకోమని వివరించారు.
జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేస్తూ తీర్మానం: జగిత్యాలలో మున్సిపల్ ప్రత్యేక కౌన్సిల్ సమావేశం ముగిసింది. జగిత్యాల మాస్టర్ ప్లాన్ ముసాయిదా రద్దు చేస్తూ ఈ కౌన్సిల్లో తీర్మానించారు. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలన్న తీర్మానానికి అందరూ ఆమోదం తెలిపారు. అంతకుముందు ఈ సమావేశంలో వాడీవేడి వాదనలు జరిగాయి. ఎమ్మెల్యే సంజయ్‌ను కొందరు కౌన్సిలర్లు నిలదీశారు. మాస్టర్ ప్లాన్‌ను మీరే రూపొందించి, మీరే ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు.