Manyam district is hit by flu: పార్వతీపురం మన్యం జిల్లాలో అనారోగ్యం పాలైతే రోగులకు నరకప్రాయమే.. ఏ చిన్న ఆరోగ్య సమస్య తలెత్తినా సమీపంలో వైద్యం అందక గిరిజన బిడ్డలు నానా అవస్థల పాలవుతున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఫ్లూ జ్వరాల బారినపడ్డ గిరిపుత్రులు వ్యయప్రయాసలు ఓర్చి ఆసుపత్రులు వెళితే రోగులతో రద్దీ మూలంగా త్వరగా వైద్యం అందే వీలు లేకపోతోంది. వాతావరణ మార్పులు కాలానికతీతంగా మన్యం ప్రజలు తరచూ ఫ్లూజ్వరాల బారిన పడుతున్నారు. ఒకవైపు వేసవి ఎండలు ముదురుతున్నా జలుబు, దగ్గు, జ్వరాలతో జనం సతమతమవుతున్నారు.
ఎండలు మండుతున్నా..: జిల్లాలో ఫ్లూ జ్వరాల తాకిడి ఎక్కువైంది. వేసవి ఎండలు మండుతున్నా జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు జ్వరంతో బాధపడే వారు ఎక్కువయ్యారు. పార్వతీపురం జిల్లాలో ఆసుపత్రులు జ్వర బాధితులతో రద్దీగా మారాయి. ఒంటి నొప్పులు, దగ్గు తదితర లక్షణాలతో జ్వరం బారిన పడుతున్నారు. నాలుగైదు రోజుల్లో జ్వరం తగ్గినప్పటికీ.. దగ్గు పదిహేను రోజుల వరకు వదలడం లేదని రోగులు వాపోతున్నారు.
జిల్లా ఆసుపత్రికి ఓపీకి 650 రోగులు..: జిల్లా ఆసుపత్రిలో రోజుకి 500 నుంచి 650 వరకు ఓపిలో రోగులు నమోదు చేయించుకుంటున్నారు. ఇందులో వందమంది వరకు జ్వర బాధితులు ఉంటున్నారు. రోగ నిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన వారిని ఇన్ పేషెంట్‌గా చేర్పించుకుని చికిత్స అందిస్తున్నారు. మరి కొంతమంది రోగులకు అవసరాన్ని బట్టి మందులు అందించి ఇళ్లకు పంపిస్తున్నారు.
జిల్లా ఆస్పత్రిలో 150 పడకలే..: జిల్లా ఆస్పత్రిలో 150 పడకల సామర్థ్యం ఉంది. కానీ ఆస్పత్రిలో 150 పడకల సామర్థ్యానికి మించి రోగులు ఇన్ పేషెంట్లుగా చేరాల్సిన పరిస్థితి ఉంది. ఫ్లూ జ్వరాల బారినపడ్డ రోగులకు జలుబు, దగ్గు, ఒంటి నొప్పులు ఎక్కువగా ఉండటంతో ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకోవాల్సిన దుస్థితి. గత మూడు నాలుగు రోజులుగా 250 దాటి సుమారు 300 మంది వరకు చికిత్స కోసం రోగులు వస్తున్నారు.
అన్ని ఆసుపత్రిల్లోనూ జ్వరబాధితులే..: ఆస్పత్రికి ప్రతి రోజూ వచ్చే రోగుల్లో 30 నుంచి 40 శాతం మంది వరకు జ్వర బాధితులు ఉంటున్నారు. జిల్లాలో 37 ప్రాథమిక హెచ్‌సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఆరు, ప్రాంతీయ ఆసుపత్రులు మూడు, జిల్లా ఆస్పత్రి ఒకటి, ప్రైవేట్ ఆసుపత్రి 20 వరకు ఉన్నాయి. అన్ని ఆసుపత్రిలలోనూ జ్వర బాధితులు కనిపిస్తున్నారు.
ఫ్లూ జ్వరాలు నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు ..: "ప్రస్తుతం ఫ్లూ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్లూ జ్వరాలు నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం’’ అని వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. ఫ్లూ జ్వరాల నిరోధానికి ముఖ్యంగా సామాజిక దూరం పాటించడం మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు.
చిన్నపిల్లల వార్డులో జ్వర బాధితులకు చికిత్స ..: జిల్లా ఆస్పత్రిలో ఓపీ వద్ద రద్దీ ఎక్కువడంతో ఇన్ పేషెంట్లుగా చేరే వారి సంఖ్య అధికంగానే ఉంటోంది. దానికి తగ్గట్లుగా పడకల ఏర్పాట్లకు కష్టమవుతోంది. తప్పని స్థితిలో చిన్నపిల్లల వార్డులో జ్వర బాధితులకు చికిత్స అందిస్తున్నారు. జ్వరాల వార్డులో రోగుల కిటకిటతో క్షణం తీరిక లేకుండా రద్దీకి తగ్గట్లుగా ఆసుపత్రి వైద్యులు చికిత్సలు అందించేలా ఏర్పాట్లు చేశామని జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ వాగ్దేవి తెలిపారు.
ఇవీ చదవండి