CPM Srinivasarao on Home Minister: గత 15 రోజులుగా మహిళలపై వరుస అత్యాచారాలు జరుగుతున్నాయని.. రౌడీలు, రాజకీయ పార్టీ నేకవ అండదండలు ఉన్నవారే అకృత్యాలకు పాల్పడుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. మహిళలు ఎక్కడికి వెళ్లినా.. చివరికి ఇంట్లో ఉన్నా.. రక్షణ లేకుండాపోయిందని ఆగ్రహించారు. వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అత్యాచారాలకు గురవుతున్నారన్నారు.పేరుకే మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటన్న ఆయన.. అత్యాచారాలకు అడ్డుకట్ట లేదన్నారు.
హోమ్ మినిస్టర్ తానేటి వనిత ఆ పదవికి అనర్హురాలని అన్నారు. వలస వచ్చిన కూలీపై రేపల్లెలో అత్యాచారం జరిగితే.. బాధితులకు ఓదార్పు కలిగించడం మానేసి అటువంటి ఘటనలు యాదృశ్చికంగా జరుగుతున్నాయని హోమ్ మినిస్టర్ అనడం విచారకరమన్నారు. బాధితులకు భరోసా కలిగించకుండా నిందితులకు కొమ్ముకాసే విధంగా మంత్రి మాటలు ఉన్నాయని అన్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత అని విశాఖలో మంత్రి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంత్రిని మందలించాలని ఆమెను పదవి నుండి తప్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాలనలో పూర్తిగా విఫలమయ్యాయన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని వాపోయారు. ధరల నియంత్రణకు చర్యలు లేవని విమర్శించారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం రైతులు కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, కర్మాగారం యాజమాన్యం బకాయిలు చెల్లించడం లేదని అటువంటి వారిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. కర్మాగారం భూములు విక్రయించి బకాయిలు చెల్లిస్తామని చెప్పిన అధికారులు నేటికీ సమస్య పరిష్కారం చేయలేదని అన్నారు. మన్యం జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనంలో ఆయన విలేకరులతో ఈమేరకు మాట్లాడారు.
ఇదీ చదవండి : Spoiled Medicine: ఉచిత ఔషధాలకు చెద.. కాలేజీ హాస్టల్‌లో మూలుగుతున్న నిల్వలు