TDP PROTEST పల్నాడు జిల్లా రొంపిచర్లలో తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. వచ్చే నెల 16వ తేదీన మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు వర్థంతి సందర్భంగా గ్రామంలో ఎన్టీఆర్, కోడెల విగ్రహాల ఏర్పాటుకు తెదేపా నేతలు యత్నించారు. గ్రామంలోని మాజీ సర్పంచ్ ఇంటూరి వెంకట్రావు విగ్రహం పక్కనే ఎన్టీఆర్, కోడెల విగ్రహాల ఏర్పాటుకు తెదేపా నేతలు పూనుకున్నారు. అయితే గ్రామంలో పంచాయతీ అనుమతి లేకుండా విగ్రహాలు ఏర్పాటు చేయొద్దంటూ రెవెన్యూ అధికారులు జేసీబీతో గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో రెవెన్యూ అధికారులను గ్రామస్థులు, మహిళలు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య వివాదం నెలకొంది. విగ్రహాల ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంఛార్జ్ చదలవాడ అరవింద బాబు, తెదేపా శ్రేణులు గ్రామానికి చేరుకుని నిరసనకు మద్దతు తెలిపారు . దీంతో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.
ఇవీ చదవండి: