Attack On Tdp Leader: పల్నాడు జిల్లాలో తెదేపా నాయకుడిపై దాడి కలకలం రేపింది. దాచేపల్లి మండలం పెదగార్లపాడులో తెదేపా నాయకుడు పురంశెట్టి పరంజోతిపై వైకాపాకు చెందిన వ్యక్తులు దాడి చేశారు. గ్రామంలోనే పట్టపగలు అందరు చూస్తుండగానే కర్రలతో వెంటపడి కొట్టారు. గాయపడిన పరంజ్యోతిని పిడుగురాళ్లలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పరంజ్యోతి పరిస్థితి నిలకడగా ఉంది. ఏడాది క్రితమే పరంజ్యోతి తండ్రి పురంశెట్టి అంకులు హత్యకు గురయ్యారు. వైకాపా నేతలే ఆయన్ను హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఇప్పుడు పరంజోతిపైనా దాడి జరగటంతో తెదేపా శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఘటన విషయం తెలియగానే దాచేపల్లి పోలీసులు పెదగార్లపాడులోని దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. దాడిపై తమకు ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. తండ్రి హత్య విషయంలో పోలీసులు నిందితులను కాపాడే ప్రయత్నం చేశారని.. అందుకే తాను ఫిర్యాదు ఇవ్వటం లేదని పరంజ్యోతి తెలిపారు.
ఇవీ చదవండి: