Potavaram Autonagar Works: ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పోతవరం ఆటోనగర్ పరిస్థితి తయారైంది. ఎంత మొత్తుకున్నా పట్టించుకునే నాధుడే లేడు.. నిధుల కొరత, పర్యవేక్షణ లోపంతో ఆటోనగర్ నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. దీంతో స్థానికులకు నిరాశ తప్పడం లేదు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో తయారుచేసే ఆటోలు, జీపుల బాడీలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ డిమాండ్‌కు అనుగుణంగానే ఈ ప్రాంతంలో అనేక తయారీ యూనిట్లు ఉన్నాయి. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా.. పట్టణానికి సమీపంలోని పోతవరంలో ఆటోనగర్ ఏర్పాటు చేయాలని నాటి టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది.
చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ఆటోమొబైల్స్ రంగానికి సంబంధించిన యూనిట్లతో ఆటోనగర్ ఏర్పాటుకు ఏపీఐఐసీ 43.25 ఎకరాలను కేటాయించింది. దానిని 2016లోనే శంకుస్థాపన చేయగా.. 50 కోట్ల రూపాయలతో తొలిదశలో రహదార్లు, మురుగు కాల్వలు, అంతర్గత రహదార్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాట్ల పనులను పూర్తి చేశారు. వైసీపీ సర్కార్ రాకతో ఆటోనగర్ నిర్మాణ పనులు నిలిచిపోయాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గతేడాది అక్టోబర్‌లో మంత్రి విడదల రజిని ఆటోనగర్ నిర్మాణంపై సమీక్ష చేసి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అయితే నిధుల సమస్య, అధికారుల అలసత్వంతో ఇప్పటికీ పనుల్లో ఎలాంటి పురోగతి లేదని కార్మికులు వాపోతున్నారు. దశాబ్దాల కల అయిన ఆటోనగర్ నిర్మాణం ఎప్పటికప్పుడు కలగానే మిగిలిపోతోందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. వందలాది కార్మికుల ఉపాధికి మేలు చేసే ఆటోనగర్ నిర్మాణ పనుల్నివెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి: