Challenges of TDP and YCP leaders: రాష్ట్రంలో వరుస సవాళ్లు.. రాజకీయాలను వేడిక్కిస్తున్నాయి. ఇప్పటికే పుట్టపర్తి రణరంగంగా మారగా.. ఇప్పుడు పల్నాడు జిల్లాలో కూడా ఇదే విధంగా సవాళ్లు మొదలయ్యాయి. అవినీతికి పాల్పడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేపై.. టీడీపీ నేత ఆరోపించారు. దీనిపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే స్పందిస్తూ.. తాను ఎటువంటి అవినీతికి పాల్పడలేదని ఎక్కడైనా చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు.
టీడీపీ నేత ఆరోపణలు: పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, అతని అనుచరులు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని.. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కొమ్మలపాటి శ్రీధర్ విమర్శించారు. అచ్చంపేట మండలం మాదిపాడు, కొత్తపల్లి వద్ద కృష్ణానదికి అడ్డంగా మట్టి రోడ్లు ఏర్పాటు చేసి రూల్స్‌కు విరుద్ధంగా ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని శ్రీధర్ చెప్పారు.
అచ్చంపేట మండలం చిగురుపాడులో మట్టి మాఫియా చేస్తున్నారని ఆరోపించారు. కొట్టినవాడే మళ్లీ పోలీసు స్టేషన్‌కు వెళ్లి.. దెబ్బలు తిన్నవాడిపైనే కేసులు పెట్టే పరిస్థితి పెదకూరపాడు నియోజకవర్గంలో ఉందని అన్నారు. నియోజకవర్గంలో నమోదవుతున్న ప్రతి పోలీస్ కేసుకు ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాలని చెప్పారు. అమాయకులను ఇబ్బందులు పెడుతున్నారని.. పిల్లి కూడా పులిలాగా మారే రోజులు దగ్గర పడ్డాయని కొమ్మాలపాటి శ్రీధర్ హెచ్చరించారు.
రాజా రెడ్డి రాజ్యాంగాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో కూడా అమలు చేయాలని వైసీపీ నేతలు చూస్తున్నారని అన్నారు. సామాన్య ప్రజలపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని.. త్వరలోనే ప్రజాక్షేత్రంలో జరిగే పోరాటంలో ప్రజలు బుద్ధి చెబుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే రియాక్షన్: కొమ్మలపాటి శ్రీధర్ తనపై ఆరోపణలు చేయడంతో.. వైఎస్సార్సీపీ నేత స్పందించారు. తనపై చేసిన అవినీతి ఆరోపణలకు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నానని.. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు సవాల్ విసిరారు. పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వరాలయంలో ప్రమాణం చేయడానికి వస్తానని చెప్పారు. ఈ నెల 9వ తేదిన ఉదయం పది గంటల నుంచి అమరావతిలోనే వుంటానని.. నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై ఎవరొచ్చినా బహిరంగ చర్చ చేద్దామని అన్నారు. కేవలం ఇసుక మీదనే కాదు. ఎటువంటి సమస్యపైన అయినా సరే తాను చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం హయాంలేనే అన్ని గ్రామాల్లో యథేచ్ఛగా ఇసుక అక్రమంగా తరలించారని ఎమ్మెల్యే శంకరరావు చెప్పారు. అదే విధంగా ఎన్జీటీలో వందకోట్లు పెనాల్టీ వేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఆరోపణలు చేయడం కాదు, చర్చకు రండి అంటూ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కోరారు. ఎవరు తప్పు చేశారో ప్రజలందరికీ తెలసని అన్నారు.
ఇరు పార్టీ నేతలు పరస్పరం సవాళ్లు చేసుకున్న నేపథ్యంలో తర్వాత పల్నాడు జిల్లాలో ఏం జరగబోతుందో అనే ప్రజలు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. దీనిపై తెలుగుదేశం నేత స్పందిస్తారో లేదో.. చర్చకు వస్తారో లేదో అని చర్చించుకుంటున్నారు.
ఇవీ చదవండి: