Admissions to NICE School: పల్నాడు జిల్లాలోని నాదెండ్ల మండలం మైనంపాడులో ఉన్న 'నైస్' (NICE-Needy Illeterate Child Education) పాఠశాల ఎంతో మంది అనాథలను, వీధి బాలలను అక్కున చేర్చుకుని విద్యను అందిస్తోంది. అమ్మలోని ఆప్యాయత, నాన్నలోని బాధ్యతలను పంచి వీధి బాలలను ఉన్నత శిఖరాలకు చేర్చేలా మార్గనిర్దేశం చేస్తోంది. రెండు దశాబ్దాలుగా ఈ పాఠశాల ఎందరో చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారి బంగారు భవితకు పునాది వేస్తోంది. దాతల సాయంతో నడుస్తున్న ఈ పాఠశాల అనురాగ వెలుగులు ప్రసరింపజేస్తూ.. విద్యార్థులను ఉన్నత శిఖరాలను చేరుకునేందుకు పాటుపడుతోంది. కాగా ఈ విద్యా కోవెలలో చదువుకునేందుకు వచ్చే ఏడాది కోసం విద్యార్థులకు ఆహ్వానిస్తోంది. ఈ మమతల కోవెలను పోపూరి పూర్ణచంద్రరావు అనే వ్యక్తి నెలకొల్పారు.
జీవితమనే నావకు.. చదువే చుక్కాని.. అని నమ్మే ఆయన 2003 ఆగస్టు 15న ఈ నైస్ విద్యాలయాన్ని స్థాపించారు. ఈ 21 ఏళ్లలో వందలాది పిల్లలకు ఈ విద్యాసంస్థ ద్వారా విద్యనందించారు. ఈ పాఠశాలలో ప్రస్తుతం 43 మంది బాలికలు, 155 మంది బాలురు ఉన్నారు. సీబీఎస్ఈ సిలబస్‌లో విద్యాబోధన చేయిస్తున్నారు. బాలికలకు, బాలురకు వేర్వేరు వసతి గృహాలు, సైన్స్, కంప్యూటర్, మ్యాథ్స్ ల్యాబ్స్ అక్కడ ఉన్నాయి. దీంతోపాటు అక్కడ ఉన్న ఓ గ్రంథాలయం 4 వేల పుస్తకాలతో విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కట్టుబట్టలతో ఆ విద్యాలయంలో చేరిన పిల్లలకు అన్ని సౌకర్యాలను ఆ సంస్థే కల్పిస్తోంది. యూనిఫాం, పుస్తకాలు, భోజనం, వసతి సదుపాయాలన్నీ అక్కడ ఉచితమే. అక్కడ చదువుతో పాటు వాలీబాల్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, కబడ్డీ వంటి అన్ని ఆటలకు శిక్షణ ఇస్తున్నారు. ఇండోర్ గేమ్స్‌లోనూ పిల్లలు రాణించేలా ప్రోత్సహిస్తున్నారు.
ప్రవేశ అనుమతులు ఇలా.. నైస్ పాఠశాలలో 5, 6 తరగతుల విద్యార్థులను చేర్చుకుంటారు. ఈ సంవత్సరం ఈ రెండు తరగతుల్లో మొత్తం 60 మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఆ విద్యాలయంలో విద్యార్థులు చదుకునేందుకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షలు మే నెల మూడో ఆదివారం, జూన్ మొదటి ఆదివారం పెట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించేలోగా పాఠశాలలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి. తల్లిదండ్రులను కోల్పోయిన విద్యార్థులను చేర్పించుకునేందుకు మొదటి ప్రాధాన్యం ఇస్తారు. తర్వాత ప్రాధాన్యంగా తల్లిదండ్రులలో ఒకరిని కోల్పోయిన విద్యార్థులకు అవకాశం కల్పిస్తారు. ఇంకా ఏమైనా వివరాలు కావాలంటే.. 89851 89232, 98660 34579 ఫోన్ నంబర్లలో సంప్రదించొచ్చు.
ఉన్నత విద్య వరకు పర్యవేక్షిస్తున్నాం..
"నైస్ పాఠశాలను దాతల సాయంతో మేము విజయవంతంగా నిర్వహిస్తున్నాం. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించి ఆ దిశగా ప్రయాణించేందుకు విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తున్నాం. ఐదు నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు ఇక్కడ విద్యను బోధిస్తున్నాం. ఇంటర్, డిగ్రీ, పీజీలు పూర్తయ్యే వరకూ పర్యవేక్షిస్తున్నాం. అనాథ పిల్లలను చేర్పించేందుకు మా స్కూల్ ఆఫీస్‌లో సంప్రదించాలి." - పోపూరి పూర్ణచంద్రరావు, వ్యవస్థాపకుడు
సౌకర్యాలు బాగున్నాయి..
"మాది బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం తంగెడుమల్లి. చిన్నతనంలోనే అమ్మ గుండెపోటుతో మృతి చెందారు. నాన్న శ్రీనివాసరావు వ్యవసాయ పనులు చేస్తారు. ఆరేళ్ల నుంచి ‘నైస్’లో చదువుతున్నా. ఇక్కడ ఆహారం, వసతి సౌకర్యాలు బాగున్నాయి. అమ్మ లేదన్న దిగులు ఏ రోజూ అనిపించలేదు. సమాజంలో విలువలతో ఎలా జీవించాలన్నది ఇక్కడ నేర్చుకున్నా. పదో తరగతి ఫస్ట్ క్లాస్‌లో పాసవుతానన్న నమ్మకం నాలో పెరిగింది." - ఎం.పవన్ సాయి మణికంఠ, పదో తరగతి
బడంటే ఎంతో ఇష్టం..
"మాది ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం అమనిగుడిపాడు. నాన్న వెంకటచలమయ్య గుండెపోటుతో మృతి చెందారు. అమ్మ రాధిక నరసరావుపేటలోని ప్రైవేటు ఆసుపత్రిలో నర్సు. నాన్న మృతితో మా కుటుంబ జరుగుబాటు కష్టమైంది. అమ్మ 'నైస్' లో చేర్పించారు. ఆరేళ్లుగా ఇక్కడే చదువుతున్న నాకు సొంత ఇంటి కంటే ఈ పాఠశాల అంటేనే ఎక్కువ ఇష్టం." - వడ్లమూడి అర్షిత, పదో తరగతి