Nara Lokesh Yuvagalam padayatra: తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ ఉద్యోగులకు మంచి ఫిట్‌మెంట్ ఇస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. ఎత్తిపోతల పథకం ద్వారా పల్నాడుకు సాగునీరు అందిస్తామని.. ప్రకటించారు. దోపిడీలో గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి.. జగన్‌కు తమ్ముడని విరుచుకుపడ్డారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అనే నినాదాలతో.. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మార్మోగింది. లోకేశ్ యువగళం పాదయాత్ర పిడుగురాళ్ల చేరుకుంది. కలశాలతో మహిళల ఆహ్వానం, గిరిజన సంప్రదాయంలో స్వాగతం.. థింసా నృత్యాలు.. కేరళ వాద్యాలు.. అశ్వదళాలు.. ఒంటెలు.. ఇలా లోకేశ్‌కు.. అడుగడుగునా పసుపుపైన్యం ఘన స్వాగతం పలికింది.
లోకేశ్ పిడుగురాళ్లలో ప్రవేశించగానే బాణసంచా మోతమోగింది. పసుపు సంద్రమైన పిడుగురాళ్ల ప్రధాన రహదారిపై.. ప్రసంగించిన లోకేశ్ ఎత్తిపోతల పథకం ద్వారా గురజాల నియోజకవర్గంలోని.. గ్రామాలకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డిని.. క్యాష్ మహేశ్‌గా లోకేశ్ అభివర్ణించారు. అభివృద్ధి చేస్తారని కాసు మహేశ్ రెడ్డిని గెలిపిస్తే.. ఆయన గురజాలకు గుండు కొట్టారని.. లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ హయాంలో యరపతినేని రూ. 2 వేల కోట్లకు పైగా అభివృద్ధి పనులు చేశారని గుర్తు చేశారు.
యువగళం పాదయాత్రలో భాగంగా పిడుగురాళ్లలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నన్న ఆయన.. కాసు మహేశ్ రెడ్డి అవినీతి గురించి తెలుసుకున్న తరువాత.. ఆయన పేరు క్యాష్ మహేశ్ రెడ్డిగా మార్చామని ఎద్దేవా చేశారు. అక్రమ మైనింగ్ ద్వారా కాసు మహేశ్ రెడ్డి వెయ్యి కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. అంతేకాకుండా భూ దందాలు, మద్యం, క్లబ్బులు, గంజాయి ద్వారా భారీగా దోచుకున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. తెలంగాణ నుంచి మద్యం తీసుకొచ్చి.. గురజాలలో అమ్ముతున్నారని లోకేశ్ దుయ్యబట్టారు.
నరసారావుపేటలో 200 కోట్ల రూపాయలతో కాసు మహేష్ రెడ్డి ఓ షాపింగ్ క్లాంపెక్స్ నిర్మిస్తున్నారని ఆరోపించారు. ప్రజలంతా తొమ్మిది నెలలు ఓపిక పడితే.. క్యాష్ మహేష్‌ని.. పిల్లి మహేశ్ చేసే బాధ్యత తాను తీసుకుంటానని లోకేశ్ తెలిపారు. అనంతరం మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు .. ఫ్యాక్షన్ రాజకీయాలకు కాసు మహేశ్‌రెడ్డి ఇకనైనా ముగింపు పలకాలని హెచ్చరించారు. యువగళం పాదయాత్ర.. ఇవాళ గురజాల నుంచి పెదకూరపాడు నియోజకవర్గంలోనికి ప్రవేశించనుంది.
Nara Lokesh Yuvagalam Padayatra: చంద్రబాబు నీళ్లు పారిస్తానంటే.. జగన్ రక్తం పారిస్తున్నాడు: లోకేశ్