Nara Lokesh Allegations on Vinukonda MLA: వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు కబ్జాల రాయుడుగా మారారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. వినుకొండలో జరిగిన యువగళం పాదయాత్ర బహిరంగ సభలో నారా లోకేశ్ మాట్లాడారు. వినుకొండ బహిరంగ సభ వేదికగా.. బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ వ్యవహారాలపై లోకేశ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బొల్లా బ్రహ్మనాయుడు ప్రభుత్వ భూములు ఆక్రమించి సెంటు భూమి పట్టాల కోసం ప్రభుత్వానికి అమ్మి.. 20 కోట్ల రూపాయలు కొట్టేశారని ఆరోపించారు.
వినుకొండ ఎమ్మెల్యేకు షాక్ ట్రీట్మెంట్: వినుకొండలో ప్రతి పనికి బి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, అభివృద్ధి పనుల పేరిట కమిషన్లు దండుకుంటున్నారని విమర్శించారు. బొల్లాను మరోసారి గెలిపిస్తే వినుకొండలో సెంటు భూమి కూడా మిగలదని హెచ్చరించారు. వినుకొండ ప్రాంతానికి కీలకమైన వరికెపుడిసెల ప్రాజెక్టు నిర్మాణంతో పాటు మరో 5 హామీలపై జగన్ మాట తప్పారని ఆరోపించారు. వినుకొండ ఎమ్మెల్యేకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చే బాధ్యత తాను తీసుకుంటానని, వినుకొండలో ఉన్నా.. విదేశాలకు వెళ్లినా లాక్కుని వచ్చి శిక్షిస్తామని హెచ్చరించారు.
వెయ్యి కోట్లకు పైగా దోపిడీ: వైసీపీ పాలనలో వంద రకాల సంక్షేమ పథకాలు నిలిపి వేశారని నారా లోకేశ్ ఆరోపించారు. ఆధ్యాత్మికంగా, చారిత్రాత్మకంగా పేరున్న వినుకొండకు పాదయాత్రగా రావటం సంతోషం కలిగించిందన్నారు. యువగళం పాదయాత్రకు ఎన్ని ఆటంకాలు కలిగించినా భయపడలేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇసుక తవ్వకాల ద్వారా ఏటా వెయ్యి కోట్లకు పైగా దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
బ్లూ బటన్.. రెడ్ బటన్..: గోదావరికి వరదలు వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే జగన్ కనీస సాయం చేయలేదన్నారు. జగన్ బల్లపైన బ్లూ బటన్, కింద వైపు ఎర్ర బటన్ ఉంటాయని విమర్శించారు. పై బటన్ నొక్కి 10 రూపాయల డబ్బులు వేస్తారని.. రెడ్ బటన్ నొక్కి వంద రూపాయలు లాక్కుంటారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
కరెంటు తీగలే కాదు.. బిల్లు పట్టుకున్నా షాక్: వైసీపీ ప్రభుత్వ హయాంలో కరెంట్ తీగలు పట్టుకుంటే కాదు బిల్లు పట్టుకున్నా షాక్ కొడుతుందని.. గాలి పీల్చినా కానీ పన్ను వసూలు చేస్తారు జాగ్రత్త అని ప్రజలను హెచ్చరించారు. టీడీపీ మినీ మేనిఫెస్టోలో 6 రకాల సంక్షేమ పథకాలు ప్రకటించామని తెలిపారు.
పోలీసులకు కూడా: టీడీపీ అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని యువతకు టీడీపీ అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ పాలనలో రద్దు చేసిన సంక్షేమ పథకాలు మళ్లీ అమలు చేస్తామన్నారు. పోలీసుల జీతభత్యాల్లో కోత విధించడం ద్వారా జగన్మోహన్ రెడ్డి పోలీసులకు కూడా షాకిచ్చారని వ్యాఖ్యానించారు.