HIGH COURT ON MACHERLA INCIDENT : పల్నాడు జిల్లా మాచర్ల దాడుల ఘటనలో గాయపడిన వారికి సంబంధించిన వైద్య నివేదికలను తమ ముందు ఉంచాలని పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్(పీపీ) నాగిరెడ్డిని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ఈ మేరకు ఆదేశాలిచ్చారు. మాచర్ల పట్టణంలో చోటు చేసుకున్న దాడుల ఘటనలో తమపై పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ టీడీపీ నేత, మాచర్ల నియోజకవర్గం ఇంఛార్జి జూలకంటి బహ్మానందరెడ్డి, సహా మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. నిందితులు 1,3,7పై తప్ప ఇతరుల విషయంలో నేరారోపణకు సంబంధించి సరైన ఆధారాలు లేవన్నారు. ప్రతిపక్షపార్టీకి చెందిన నేతలను వేధించాలని, భయభ్రాంతులకు గురిచేయాలన్న కారణంతో కేసు నమోదు చేశారన్నారు. పిటిషనర్ల ఇళ్ల పైనే అధికార పార్టీకి చెందిన నేతలు దాడులకు పాల్పడ్డారన్నారు. ఇళ్లు ధ్వంసం చేశారన్నారు. కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయన్నారు.
పీపీ నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. మొదటి నిందితుడికి నేర చరిత్ర ఉందన్నారు. దాడులకు పాల్పడి అధికార పార్టీ కార్యకర్తలను గాయపరిచారన్నారు. బెయిలు ఇవ్వొద్దని.. ఇస్తే ఇలాంటి ఘటనలను ప్రోత్సహించినట్లవుతుందన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. బాధితుల గాయాలకు సంబంధించిన వైద్య నివేదికలను కోర్టు ముందు ఉంచాలన్నారు. వారికి తేలికపాటి గాయాలయ్యాయా, తీవ్ర గాయాలయ్యాయా పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
ఇవీ చదవండి: