Chapakudu Program in Palnadu: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో జరుగుతున్న వీరుల తిరుణాల సందర్భంగా.. మూడో రోజున చాపకూడు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జిల్లా కలెక్టర్ శివశంకర్, ఎస్పీ రవిశంకర్‌రెడ్డి లు ఈ కార్యక్రమానికి హజరైయ్యారు. కుల, మత, వర్గ వైషమ్యాలను తొలగించి.. సర్వమతాలను ప్రోత్సహించేలా చాపకూడు సిద్ధాంతాన్ని బ్రహ్మనాయుడు ప్రతిపాదించి అమలు చేశారని.. వారు గుర్తుచేశారు. చాపకూడు సిద్ధాంత ఛాయాచిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం చాపకూడు కార్యక్రమంలో పాల్గొని సహపంక్తి భోజనం చేశారు.
పల్నాటి వైభవం, సంస్కృతి సంప్రదాయాలను విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని.. ప్రజాప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ఐదు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమాన్ని ఈ నెల 23న ప్రారంభించారు. మూడోరోజైన శుక్రవారం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు.. 850 ఏళ్ల క్రితం జరిగిన పల్నాటి యుద్ధాన్ని పురస్కరించుకొని మతసామరస్యానికి చిహ్నంగా భావించి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నామని తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై సహపంక్తి భోజనాలు చేశారు. యుద్ధంలో తమ పూర్వీకులు చూపిన శౌర్యపరాక్రమాలను గుర్తుచేసుకున్నారు.
ఇవీ చదవండి: