Chandrababu meeting with BC leaders: రాష్ట్రంలో జనాభా నిష్ఫత్తి ప్రకారం వెనుకబడిన వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా న్యాయం చేసే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అన్ని కులాల వారికి జనాభా ప్రాతిపదికన ప్రత్యక్ష ఎన్నికల్లో అవకాశాలు ఇస్తామని పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో బీసీలతో నిర్వహించిన సమావేశంలో వెల్లడించారు.
పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా సత్తెనపల్లిలో టీడీపీ నిర్వహించిన బీసీలకు ఇదేం ఖర్మ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడి జీవించేవారికి సామాజికంగా, రాజకీయంగా తొలిసారిగా అండగా నిలిచి చేదోడు అందించిన ఘనత ఎన్టీఆర్‌కు దక్కుతుందన్నారు. వెనుకబడిన వర్గాలపై అధ్యయనం చేయడానికి సాధికారిక కమిటీ నియమించామని ఆకమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని ఎన్నికల ప్రణాళికలో చేరుస్తామన్నారు. రాష్ట్రంలో పేదల్ని ధనవంతులుగా తీర్చిదిద్దడం కోసం పీ-4 ఫార్ములా రూపొందించానని చంద్రబాబు చెప్పారు. ఇందులో బీసీలకు అగ్ర ప్రాధాన్యమిస్తానని హామీ ఇచ్చారు.
భవిష్యత్తులో చేతి, కులవృత్తులు తయారుచేసే ఉత్పత్తులకు ఆధునికత జోడించి ప్రపంచ అవసరాలు తీర్చే కేంద్రంగా ఏపీని మారుస్తామన్నారు. టీడీపీ హయాంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 24 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో చాలామంది వ్యక్తులు నాయకులుగా ఎదిగారన్నారు. ఏపీ, తెలంగాణ తెలుగుదేశం పార్టీల అధ్యక్షులు బీసీలే అని గుర్తుచేశారు. ఎన్ని రాజకీయపార్టీలు కుప్పిగంతులు వేసినా బీసీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమన్నారు. వెనుకబడి వర్గాలకు రూ.36 వేల కోట్లు ఉప ప్రణాళిక నిధులు ఖర్చు చేయడమే కాకుండా ఆధునిక పనిముట్లు, ఆదరణ వంటి అనేక వినూత్న కార్యక్రమాలతో ముందుకు వెళ్లామని చంద్రబాబు వివరించారు.
రాష్ట్రంలో 140 వెనుకబడిన కులాలకు 54 సాధికార కమిటీల వేశామని బీసీలను రాజకీయ, ఆర్థిక, సామాజిక ముందుకు తీసుకెళ్లడమే వాటి లక్ష్యమని వివరించారు. వైసీపీ ప్రభుత్వంలో కార్పోరేషన్లు ఏర్పాటుచేసినా కుర్చీలు, బెంచీలకు కూడా నిధులు ఇవ్వలేదని ఎద్దేవా చేశారు. కార్పొరేషన్లతో బీసీలకు ఒనగూరింది ఏమి లేదని స్పష్టం చేశారు. వాటి ద్వారా ఒక్క రూపాయి ప్రయోజనం జరిగిందా?అని సవాల్ విసిరారు. జగన్ భజన చేయడానికి తప్పించి బీసీ కార్పోరేషన్లు ఎందుకని ప్రశ్నించారు. జగన్‌మోహనరెడ్డి మీ అందరిని దోచుకుని ధనవంతుడు కావాలనుకుంటున్నాడని. ఆరోపించారు . గొర్రెల పెంపకందారులు తెలంగాణలో వలె గొర్రెలు ఇవ్వాలని కోరగా చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. రాయితీపై గొర్రెలు అందించే విషయం ఆలోచిస్తున్నానని చెప్పారు. కల్లుగీత కార్మికులకు మద్యం దుకాణాల లైసెన్సులో 25శాతం రిజర్వేషన్ ఇచ్చేలా చూస్తామన్నారు.
రాష్ట్రంలో ఇసుక, భూములు, సహజ సంపదే కాకుండా ప్రజల ఆస్తుల్ని వైసీపీ నేతలు దోచేస్తున్నారని ఆరోపించారు. విశాఖలో రామానాయుడు స్టూడియోకు భూమి కేటాయిస్తే దానిని కబ్జా చేసే పరిస్థితి వచ్చిందన్నారు. హత్యలు, దోపిడీలు చేసేవారిని అధికారంలోకి రానీయొద్దని కోరారు. సత్తెనపల్లి పట్టణంలో బీసీ వర్గానికి చెందిన యువకుడు తురక అనిల్ చనిపోతే మంత్రి అంబటి రాంబాబు.. పరిహారంలో సగం వాటా అడిగిన ఘనుడని ధ్వజమెత్తారు. ఇది శవాలపై బొరుగులు ఏరుకోవడం కాక ఇంకేంటి అని నిలదీశారు. అనిల్ చెల్లెలును ఎన్టీఆర్ మొమోరియల్ ట్రస్టు ద్వారా చదివిస్తామని, ఆ కుటుంబానికి ఆర్థిక సాయంగా.2 లక్షలు అందించానని తెలిపారు. కసాయివాడు, తాగుబోతు చేతిలో అమ్మాయిని పెడితే ఆమె జీవితం ఏమవుతుందో జగన్ చేతిలో రాష్ట్రం ఆవిధంగా తయారైందన్నారు. ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని రివర్స్‌గేర్‌లో పెట్టి నాశనం చేశారని ధ్వజమెత్తారు.
'రాష్ట్రంలో కొన్ని పదవులు బీసీలకు ఇచ్చి వారిని ఉద్ధరించినట్లు వైసీపీ ప్రచారం చేస్తోంది. ఆ పార్టీ మైండ్‌గేమ్ ఉచ్చులో బీసీలు పడొద్దు బాబాయిని చంపిన వ్యక్తి బీసీలకు న్యాయం చేస్తాడా? స్థానిక ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన 34 శాతం రిజర్వేషన్‌ను 24 శాతానికి తగ్గించడంపై బీసీ నాయకులు వైసీపీని నిలదీయాలి. దీనివల్ల 17వేల పదవులు వెనుకబడిన వర్గాలవారు కోల్పోయారు. గత నాలుగేళ్లలో రాష్ట్రంలో బీసీలపై 2,600 దాడులు జరిగాయి. 26 మంది పొట్టనబెట్టుకున్నారు. బీసీ ఆస్తులన్నీ కబ్జా చేశారు.' -చంద్రబాబు నాయుడు
రాష్ట్రంలో వైనాట్ 175 అని, వైనాట్ కుప్పం అని గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని, అందుకే మనం వైనాట్ పులివెందుల అంటున్నామని, పులివెందుల నుంచి జగన్ పతనం ప్రారంభమవుతుందని చంద్రబాబు హెచ్చరించారు.
ఇవీ చదవండి: