JAGANANNA CHEDODU SCHEME : జగనన్న చేదోడు మూడో విడత సాయం మంజూరుకు ప్రభుత్వం చేస్తున్న హడావుడి.. అర్హులు, లబ్ధిదారులు, చివరకు అధికారులకూ అర్థం కావడం లేదు. నేడు ఆర్థిక సాయం విడుదల చేస్తామని.. ఈ నెల 24వ తేదీనే ప్రభుత్వం ప్రకటించింది. కానీ.. కొత్త దరఖాస్తులు, వేలిముద్రల నమోదు, పరిశీలనకు కేవలం 4 రోజల సమయమే ఇచ్చింది.
అంటే... ఈ నెల 27న సాయంత్రం వరకూ పరిశీలించిన దరఖాస్తులకు సోమవారం నిధులు జమచేస్తామని పేర్కొంది. ఆ లోపు చాలా దరఖాస్తులను పరిశీలించలేదు. దీంతో మిగిలిన వాటిని ఫిబ్రవరి 4 వరకూ తనిఖీ చేసి.. వాటికి అదే నెల 11న నిధులు జమచేస్తామని.. గ్రామ, వార్డు సచివాలయాలకు ఆదివారం మౌఖిక ఆదేశాలిచ్చింది. మూడో విడత సాయం కింద 3 లక్షల 30 వేల 145 మందికి.. 330.15 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ఒక ప్రకటన విడుదల చేసింది.
2022-23 సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఆసరా మూడో విడత నిధులు... జనవరిలో, చేదోడు సాయాన్ని ఫిబ్రవరిలో ఇవ్వాలి. ఆ మేరకు ఆసరా లబ్ధిదారుల వేలిముద్రలూ సేకరించగా... జనవరి చివరలో నిధులు విడుదల చేస్తారనే ప్రచారం జరిగింది. ప్రభుత్వం ఉన్నట్లుండి దీన్ని వెనక్కి నెట్టి... చేదోడుపై కార్యాచరణ ప్రకటించింది. ఇప్పటికిప్పుడు చేదోడును ఎందుకు ముందుకు తీసుకొచ్చిందా అని... అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది.
మళ్లీ ధ్రువపత్రాల సేకరణ ఎందుకు? ఈ ఏడాది కొత్త దరఖాస్తుదారులు, పాత లబ్ధిదారులు కలిపి.. 3 లక్షల 30 వేల 145 మంది ఉన్నట్లు లెక్కగట్టింది. ఇందులో గతేడాది 2.85 లక్షల మంది లబ్ధిదారుల కుల, ఆదాయ, కార్మిక ధ్రువపత్రాలు.. ప్రభుత్వం వద్దే ఉన్నాయి. అయినప్పటికీ... మళ్లీ కొత్తగా సమర్పించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వారంతా కార్యాలయాల చుట్టూ తిరిగినా గడువులోగా... ఆయా పత్రాలు జారీ కాలేదు.
మీ-సేవా కేంద్రాల నుంచి పత్రాలు తీసుకొస్తే.. అవి చెల్లవని... సచివాలయాల్లో తీసుకున్నవే కావాలని... గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. దాదాపు 30 వేల మందికి సంబంధించిన వివరాలు ఇంకా సచివాలయాలకు అందనట్లు... అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. వీరిలో గతేడాది లబ్ధి పొందిన వారే ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసింది. దీనిపై సచివాలయ అధికారుల్ని వివరణ కోరగా... ప్రతి పథకానికీ ఆధార్ లింక్ ఉండే ధ్రువపత్రాలను... సేకరిస్తున్నామని... చేదోడు పథకానికీ అదే వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: