Yuvagalam padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈనెల 27 నుంచి చేపట్టనున్న యువగళం పాదయాత్రకు ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఎలాంటి అనుమతి లభించలేదు. జనవరి 12న రాష్ట్ర డీజీపీ, హోమ్ సెక్రటరీ, చిత్తూరు ఎస్పీ, పలమనేరు, పూతలపట్టు డీఎస్పీలకు యువగళం యాత్రకు అనుమతి కోరుతూ టీడీపీ లేఖలు రాసింది. అనుమతిపై ఇప్పటివరకూ పోలీసు శాఖ నుంచి గానీ... రాష్ట్ర ప్రభుత్వం నుంచి గానీ ఎలాంటి స్పందన రాకపోవడాన్ని పార్టీ శ్రేణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
అనుమతి ఇచ్చినా, ఇవ్వకపోయినా యువగళం యాత్ర ఆగేది లేదని, కచ్చితంగా జరిగి తీరుతుందని తేల్చి చెప్తున్నారు. పాదయాత్రకు అనుమతులు అవసరం లేదంటూ గతంలో జగన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో వైసీపీ చేసిన ప్రకటనలను టీడీపీ నేతలు బయట పెడుతున్నారు. జనవరి 27వ తేదీన కుప్పం నుంచి పాదయాత్ర చేపట్టనున్న లోకేశ్, 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్లు రాష్ట్రంలో పర్యటించేలా కార్యాచరణ రూపొందించుకున్నారు.
ప్రతీ నియోజకవర్గంలో 3రోజుల పాటు, ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాలో నెలరోజుల పాటు పాదయాత్ర సాగనుంది. చిత్తూరు జిల్లా నుంచి అనంతపురం, కర్నూల్, కడపల మీదుగా రాయలసీమ జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసి నెల్లూరు, ప్రకాశం జిల్లాల మీదుగా కోస్తా జిల్లాల్లోకి యువగళం పాదయాత్ర ప్రవేశించనుంది. ఈ నెల 25వ తేదీన కడప వెళ్లనున్న లోకేశ్.. అక్కడ దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
అదే రోజు కడపలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆ తరువాత 26వ తేదీన తిరుమల శ్రీవారిని దర్శించుకుని రాత్రికి కుప్పం చేరుకుంటారు. 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కుప్పం నియోజకవర్గం లక్ష్మీపురంలోని వరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడ నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నారు.
డీజీపీకి రిమైండర్ పంపిన వర్ల రామయ్య: నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అనుమతులకు సంబంధించి నేటి వరకు ఎటువంటి స్పందన రాలేదంటూ టీడీపీ నేత వర్ల రామయ్య డీజీపీకి రిమైండర్ లేఖ పంపారు. పాదయాత్ర తేది సమీపిస్తున్నప్పటికీ మీ వైపు నుంచి ఎటువంటి స్పందన లేదని లేఖలో ప్రస్తావించారు. జనవరి 27న మొదలు కానున్న పాదయాత్రకు త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. అనుమతులు ఇస్తే అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు వీలుగా ఉటుందని లేఖలో పేర్కొన్నారు. పాదయాత్రకు సంబంధించిన సమాచారం కొరకు టీడీపీ నేత బీదా రవిచంద్ర, లోకేశ్ పీఏ నరేష్‌లను సంప్రదించవచ్చని వర్ల తెలిపారు.
ఇవీ చదవండి: