YSRCP government on Weavers : విపక్షంలో ఉండి పాదయాత్ర చేసిన సమయంలో చేనేతలకు తాను దోస్తీ అన్నాడు. అధికారంలోకి రాాగానే వారి సమస్యలన్నీ తీరుస్తానని మాటిచ్చాడు. తీరా అధికారం చేపట్టి ముఖ్యమంత్రైనా తర్వాత మాత్రం.. కేవలం నేతన్న నేస్తంతో చేతులు దులుపుకున్నాడు. అది కూడా సొంత మగ్గాలు ఉన్నవారికేనంటూ షరతులు విధిస్తూ.. దీంతో సొసైటీలలో పనిచేసే కార్మికులకు చుక్కెదురైంది. ప్రభుత్వం నుంచి రాయితీలు రాక.. చేనేత ఉత్పత్తులకు ప్రోత్సాహకాలు లేక నేతన్నల బతుకులు తెగిపోయిన దారం పోగులా తయారయ్యాయి.
రాష్ట్రంలో చేనేత రంగంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారు. గతంలో చేనేత రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలను అమలు చేశాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఈ రంగాన్ని పట్టించుకోవటమే లేదని నేతన్నలు ఆరోపిస్తున్నారు. లక్షలాది మంది కార్మికులు ఈ రంగంలో పని చేస్తుండగా కేవలం.. 80వేల 546 మందికి మాత్రమే నేతన్న నేస్తం పథకాన్ని వర్తింపజేస్తున్నారని వాపోతున్నారు. సొంత మగ్గం ఉన్నవారే ఈ పథకానికి అర్హులని ప్రభుత్వం నిబంధనలు విధించటంతో నేత కార్మికులు నష్టపోతున్నారు. పెద్ద సంఖ్యలో కార్మికులు సొసైటీలు, మగ్గాలు ఉన్న యజమానుల వద్దే పని చేస్తున్నారు. దశాబ్దాలుగా ఈ వృత్తిలో ఉన్నా అనేకమంది కార్మికులకు సొంత మగ్గాలు లేవు. కొందరు అద్దెకు మగ్గాలు సమకూర్చుకుని నేస్తుంటారు. అలాంటి వారికీ నేతన్న నేస్తం వర్తించడం లేదు. కొన్నిచోట్ల అయితే ప్రతిపక్షాలకు సంఘీభావం తెలుపుతున్న వారిని ఈ పథకం నుంచి తప్పించారు. పల్నాడు జిల్లా గారపాడులోని కొందరు ఈ విధంగా పథకానికి దూరం కావటంతో.. కొందరు హైకోర్టును ఆశ్రయించారు. వృత్తి ఆధారంగా అందించాల్సిన పథకాన్ని సాకులతో తిరస్కరిస్తుండటంతో నేతన్నలు ఆవేదన చెందుతున్నారు.
"ఇళ్లు వాకిల్లు వదిలి ఎక్కడెక్కడి నుంచో వచ్చి జీవనం సాగిస్తున్నారు. సొంత మగ్గాలు ఉన్నవారికే నేతన్న నేస్తం అని షరతులు విధించారు. ఇది బాగానే ఉన్నా.. సొంత మగ్గాలు లేని వారికి అందించే పథకాలైనా అందివ్వాలిగా"- నేత కార్మికుడు
వైసీపీ ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తర్వాత.. పావలా వడ్డీ రుణాలను నిలిపేసిందని.. 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం అమలు చేయటం లేదని చేనేత కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. గతంలో ప్రభుత్వ వసతి గృహాలకు చేనేత సహకార సొసైటీల్లో తయారు చేసే దుప్పట్లు, కండువాలు సరఫరా చేసేవారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు కూడా సొసైటీల నుంచే వచ్చేవి. ఇప్పుడు వాటిన్నింటినీ చాలా వరకు నిలిపేశారని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆప్కో నుంచి కూడా కొనుగోళ్లు ఆశించిన మేర ఉండటం లేదన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు యూనిఫాం సరఫరా చేసే కాంట్రాక్ట్ అధికార పార్టీ నేతకు అప్పగించటంతో.. లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి దెబ్బతిందని కార్మిక సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"చేనేత కార్మికులను ఆదుకోవటానికి గానీ, వారి మనుగడ కోసం గానీ.. ఒక్క రూపాయి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బడ్డెట్లో కేటాయించలేదు. 48 నుంచి 50 లక్షల మంది చేనేత కార్మికులు ఈ రాష్టంలో ఉంటే.. కేవలం 200 కోట్ల రూపాయల నిధులను మాత్రమే నేతన్న నేస్తం పథకానికి కేటాయించారు." -గుత్తికొండ ధనుంజయ్, చేనేత రంగ నిపుణులు
చేనేత సొసైటీలకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు నిలిపేయటంతో కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాయితీల సొమ్ము 100 కోట్ల మేర బకాయిలు ఉన్నాయన్నారు. బోగస్ సొసైటీలను నిలువరించకపోవడం, పవర్‌లూమ్స్‌ను కట్టడి చేయకపోవడంతోనే నేతన్నలకు సమస్యలు వస్తున్నాయని చేనేత రంగ నిపుణులు చెబుతున్నారు.
ఇవీ చదవండి :