Young Girl Selected for National Child Science Congress: విజ్ఞానం అంటే కేవలం పుస్తకాల్లోనే కాదు. సమాజాన్ని చదివి కూడా నేర్చుకోవచ్చని నిరూపిస్తోంది ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి. పాఠశాల దశలోనే క్రీడలపై పరిశోధన చేసి అందరికి ఆదర్శంగా నిలిచింది. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు ఎంత అవసరమో ప్రపంచానికి చెబుతోంది. కనుమరుగవుతున్న ప్రాచీన క్రీడలకు జీవం పోయడంతోపాటు చిన్నారుల్లో ఉత్సాహం నింపేందుకు కృషి చేసింది.
విజయవాడలోని వన్ టౌన్ మద్ది సుబ్బారావు పాఠశాల్లో 9వ తరగతి చదువుతోంది షేక్ ఉజ్మా. ఈ డిజిటల్ కాలంలో ఏ ఆట అయినా కంప్యూటర్ పై చేతివేళ్లతోనే ఆడుతున్నారు. సంప్రదాయ క్రీడలను ఆడటం ద్వారా విద్యార్థుల్లో ఎటువంటి మార్పులు జరుగుతాయన్న అంశాన్ని సర్వే చేయాలని ఈ విద్యార్థిని నిర్ణయించుకుంది.
ప్రస్తుతం తల్లిదండ్రులు రోజులో ఎక్కువ సమయం పిల్లల చదువుకే కేటాయిస్తున్నారు. ఆటలాడితే చదువులో వెనుకబడతారని వాటికి దూరంగా ఉంచుతున్నారు. చిన్నప్పుడు తొక్కుడు బిళ్ల, ఖోఖో వంటి సంప్రదాయ ఆటలు ఆడేవాళ్లు చిన్నారులు. క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు ప్రస్తుతం మొబైల్కు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. ఫోన్‌లో గంటల సేపు ఆటలాడుతూ సమయం గడుపుతున్నారు.
'గురి' తప్పని బుల్లెట్ - రైఫిల్ షూటింగ్‌లో పతకాల పంట పండిస్తోన్న యువ కెరటం
సెల్ఫోన్ కారణంగా పిల్లల ఎదుగుదలలో సమస్యలు వస్తున్నాయని మానసిక వైద్యులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు మెుబైల్ ఫోన్‌లో ఆటలు ఆడితే వారి మానసిక, శారీరక ఎదుగుదల దెబ్బ తింటుందని గ్రహించిన ఉజ్మా నేటి తరం విద్యార్థులకు తెలుగు సంప్రదాయ క్రీడలను పరిచయం చేసి వారిని చరవాణి నుంచి దూరం చేయాలని సంకల్పించింది. తనకు వచ్చిన ఆలోచనను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు తెలపడంతో వారు కూడా తమ వంతు ప్రోత్సాహాన్ని అందించారు.
తాను చదువుతున్న పాఠశాలలోనే 60 మంది విద్యార్థులను ఉజ్మా ఎంపిక చేసుకుంది. తొక్కుడు బిళ్ల, ఖోఖో, జగ్లింగ్తో పాటు శారీరక ధారుడ్యాన్ని పెంచేందుకు రన్నింగ్, లాంగ్ జంప్, షాట్ పుట్, మెంటల్ హెల్త్, ఎబిలిటి, యోగాపై కూడా శిక్షణ ఇచ్చారు. దాదాపు 31 రోజుల పాటు సాగిన ఈ శిక్షణలో విద్యార్థులు శారీరక, మానసిక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయని విద్యార్థిని చెబుతున్నారు.
యువత 'బిజీ'నెస్! మేనేజ్‌మెంట్ కోర్సుల దిశగా అడుగులు - ప్రపంచస్థాయిలో అపార అవకాశాలు
జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పోటిల్లో షేక్ ఉజ్మా తన ప్రతిభను చాటింది. జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొన్న 36 ప్రాజెక్టుల్లో 7 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన 7 ప్రాజెక్టుల్లో తమ ప్రాజెక్టు ఉండటం సంతోషంగా ఉందని విద్యార్థిని చెబుతోంది. ఈ ప్రాజెక్టు ఇంత విజయవంతం కావడానికి ఉపాధ్యాయుల ప్రోత్సహం ఎంతో ఉందని ఆమె తెలిపారు.
ప్రాచీన క్రీడల్లో ఎంతో ప్రాముఖ్యత ఉందని, వాటిని విద్యార్థులు నేర్చుకోవాలని మద్ది సుబ్బారావు ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పీ.శ్యామల తెలిపారు. క్రీడలు ఆడిన తర్వాత విద్యార్థుల్లో ఎంతో మార్పు వచ్చిందన్నారు. నిర్భంద విద్య కంటే ఆహ్లాదకరమైన వాతావరణంలో చదివితేనే ఆ విద్యార్థి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లతారని ఆమె చెప్పారు. సంప్రదాయ క్రీడలకు జీవం పోసేందుకు ఇటువంటి పరిశోధనలు ఉపయోగపడతాయని విద్యావేత్తలు చెబుతున్నారు. చదువంటే తరగతి గది మాత్రమే కాదు సామాజిక అంశాలను సైతం అవగతం చేసుకోవాలని షేక్ ఉజ్మా నిరూపిస్తోంది.