Minister Ramprasad Reddy meet Nitin Gadkari: కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిల్లీలో కలిశారు. గడ్కరీ నివాసంలో సుమారు 45 నిమిషాల పాటు సమావేశమైన మంత్రి మండవల్లి పలు అంశాలపై చర్చించారు. ఈ భేటీలో రవాణా శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. రోడ్డు భద్రతా ప్రమాదల నివారణలో భాగంగా కడప - రాయచోటి రహదారిని 4 లైన్ల రహదారిగా విస్తరించేందుకు సహకరించాలని కోరారు. ఈ మార్గంలో 4 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం సహకారం అందివ్వాలని మంత్రి రాంప్రసాద్ కోరారు.
అందులో భాగంగా రాయచోటిలో సెంట్రల్ రోడ్ విస్తరణ చేసేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ క్రమంలో పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టే విధంగా ఆదేశాలు జారీ చేయాలని మంత్రి కోరారు. రాజంపేట - రాయచోటి - కదిరి రహదారిని జాతీయ రహదారిగా మెరుగుపరిచేందుకు శాఖపరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు. రాష్ట్రంలో రవాణా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారని తెలిపారు.