YCP leader attack on Dharmavaram silk sarees traders: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టుచీరల వ్యాపారులను నిర్భందించి చితకబాదిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తుంది. బట్టల దుకాణ యాజమాని వైసీపీ నాయకుడు కావడంతో పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. విజయవాడలోని స్టెల్లా కళాశాల సమీపంలో ఉన్న ఆలయ శిల్క్స్ ఎండి అవినాష్ గుప్తా తెనాలికి చెందిన వైసీపీ నాయకుడు. దీంతో పట్టుచీరల వ్యాపారుల దుస్తులూడదీసి, వారిని చితకబాదినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తున్నా.. అతడి మీద ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సుమోటోగా కేసును స్వీకరించాల్సిన పోలీసులు.. తమకు బాధితులు ఫిర్యాదు చేయలేదు.. అందుకే చర్యలు తీసుకోలేదని పేర్కొవడం గమనార్హం. వైసీపీ నాయకులు అయితే చాలు ఎలాంటి దారుణాలకు పాల్పడినా అడిగేవారు లేరనేది ఈ ఘటనతో మరోసారి స్పష్టమైంది.
ఒంటిపై దుస్తులు తొలిగించి వీడియో తీస్తూ దాడి.. ఆలయ శిల్క్స్‌కు ధర్మవరం, హిందూపురం తదితర ప్రాంతాల నుంచి చేనేత పట్టుచీరల వ్యాపారులు చీరలు పంపిణీ చేస్తుంటారు. వారికి చెల్లించాల్సిన బకాయిలు ఇవ్వకపోవడంతో 20 రోజుల కితం 8 మంది పట్టుచీరల వ్యాపారులు బకాయిలు కోసం ఆలయ శిల్క్స్ దుకాణానికి వచ్చారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని అవినాష్‌ను అడిగారు. వారంలో రోజుల్లో ఇస్తానని చెప్పడంతో వెళ్లిపోయారు. వారిలో ఇద్దరు వ్యాపారులు శశి, ఆనంద్‌లు ఆ పూట నగరంలోనే ఉండి, సాయంత్రం మళ్లీ దుకాణానికి వచ్చి తమ బకాయి చెల్లిస్తేనే వెళ్తామని పట్టుబట్టారు. దీంతో వారి మధ్య వాగ్వదం చోటు చేసుకుంది.
అవినాష్, సిబ్బందితో కలిసి ఆనంద్, శశిలను ఆ దుకాణంలోని మూడవ ఫ్లోర్‌లోని స్టొర్ రూంలో నిర్భందించారు. అనంతరం వాళ్ల ఒంటిపై దుస్తులు తొలిగించి వీడియో తీస్తూ కర్రలతో కొడుతూ చిత్రహింసలకు గురిచేశారు. వారు దండం పెడుతూ కొట్టవద్దని వేడుకుంటున్నా విచక్షణ రహితంగా దాడి చేశారు. ఒక రోజు పాటు ఇరువురిని షోరూంలో నిర్భందించి విడిచిపెట్టారు. అవినాష్ సెల్‌ఫోన్లో చిత్రికరించిన వీడియోలను ధర్మవరంలోని మిగిలిన వ్యాపారులకు పంపించాడు. బకాయిల కోసం విజయవాడ వస్తే మీకు కుడా ఇదే గతి పడుతుందని హెచ్చరించారు.
వైసీపీ పార్టీ అండతో మోసాలు.. అప్పులు చేయడం.. అడిగితే దాడులకు పాల్పడడం అతని నైజం.. తన ఆడి కారును రేపల్లెకి చెందిన ఓ వ్యక్తి వద్ద రూ.12 లక్షలకు తాకట్టు పెట్టాడు. అనంతరం అతడి మీద కేసు పెట్టి తిరిగి ఆ కారును తెచ్చుకున్నాడు. ఇలా అనేక ఘటనలకు పాల్పడ్డాడు. విజయవాడలో పెద్ద బట్టల దుకాణం ఉందని తెనాలిలో.. తెనాలిలో ఆస్తులు ఉన్నాయని విజయవాడలో, దీనికితోడు వైసీపీని అడ్డం పెట్టుకుని అందినకాడికి అప్పులు చేసేవాడు. దుకాణంలో దుస్తులు సరఫరా చేసే వ్యాపారులకు చుక్కలు చూపించేవాడు. సరుకు తీసుకోవడం నగదు చెల్లించకుండా ఏళ్ల తరబడి తిప్పించుకోవడం పరిపాటిగా మారింది. వైసీపీ పార్టీ అండ ఉండడంతో పోలీసులను ఆశ్రయించేందుకు బాధితులు భయపడేవారు. తాజగా ధర్మవరం పట్టుచీరల వ్యాపారులు సైతం అవినాష్ వైసీపీ చెందిన వ్యక్తి కావడం వల్ల కేసు పెట్టినా తమకు న్యాయం జరగదని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.