Women Farmers Protest: ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ల గ్రామం వద్ద ఆర్అండ్బీ రహదారిపై పవర్‌గ్రిడ్ బాధితులు ఆందోళన చేపట్టారు. తమకు రావాల్సిన రు.39 లక్షలు నష్టపరిహారం మధ్యలో ఉన్న వ్యక్తి స్వాహా చేయటంపై నిరసన వ్యక్తం చేశారు. ముప్పాళ్ల గ్రామానికి చెందిన 29 మంది నిరుపేద రైతులు.. తమకు చెందిన 10 ఎకరాల అసైన్డ్ భూమిని పవర్‌గ్రిడ్ సంస్థ విద్యుత్తు లైన్ ఏర్పాటు కోసం ఇచ్చారు. 29 మంది రైతులు ఒక్కొక్కరు 35 సెంట్ల భూమిని నాలుగేళ్ల క్రితం అందజేశారు. ఇందుకు పరిహారంగా పవర్ గ్రిడ్ చెల్లించిన నష్టపరిహారాన్ని.. గ్రామానికి చెందిన వ్యక్తి తన ఖాతాలో జమ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడేళ్ల నుంచి ఈ పరిహారాన్ని తమకు ఇవ్వాలని బాధిత రైతులు.. అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయిందన్నారు.
ఇటీవల కలెక్టర్ మధ్యలో ఉన్న వ్యక్తి నుంచి డబ్బులు బాధిత రైతులకు అందజేయాలని.. లేకపోతే అతడిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ గత ఆరు నెలలుగా స్థానిక అధికారులు ఎవరూ పట్టించుకోవట్లేదని ఆరోపించారు. గత్యంతరం లేక రహదారిపై బైఠాయించి చందర్లపాడు-నందిగామ మధ్య రాకపోకలను స్తంభింపజేశారు. అటుగా వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావును సైతం అడ్డుకున్నారు. పోలీసులు బలవంతంగా ఆందోళనను విరమింపజేశారు. మహిళా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై బాధిత రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవీ చదవండి: