Raids on Jewellery Shops : తూకాలలో తేడాలు వస్తున్నాయని అందిన ఫిర్యాదుల మేరకు తూనికలు, కొలతల శాఖ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. తణుకు, విజయవాడ, తిరుపతి తదితర ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు. విజయవాడలోని పలు జ్యూవెల్లర్స్లో తూనికలు, కొలతల శాఖ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. పైఅధికారుల నుంచి ఆదేశాలు రావటంతో.. ఈ దాడులు నిర్వహించినట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్ కృష్ణ చైతన్య తెలిపారు. ఈ తనిఖీల్లో బంగారం బరువులో వ్యత్యాసాలు ఉన్నట్లు గుర్తించామన్నారు. సరైన ప్రమాణాలు లేని యంత్రాలను బంగారం తూకం వేయాటానికి వినియోగిస్తున్నట్లు.. గుర్తించామని ఆయన తెలిపారు. అవకతవకలకు పాల్పడిన జ్యూవెల్లర్స్ యాజమానులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
"తనిఖీల్లో మేము బంగారం దుకాణాలు వినియోగించే.. తూకాల యంత్రాలను పరిశీలిస్తున్నాము. తూనికలు కొలతల శాఖ అనుమతులు పొందిన యంత్రాలను వినియోగిస్తున్నారా లేదా అని పరిశీలించాము. విజయవాడ కళ్యాణ్ జ్యావెల్లర్స్లో అవకతవకలు గమనించాము. దీనిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటాం." - కృష్ణచైతన్య, తూనికలు, కొలతల శాఖ డిప్యూటీ కంట్రోలర్
పశ్చిమగోదావరి జిల్లాలో సైతం అధికారులు బంగారం దుకాణాలపై దాడులు నిర్వహించారు. తణుకులోని బంగారం దుకాణాలపై దాడులు నిర్వహించిన అధికారులు.. తూకాలలో తేడాలు గమనించిన దుకాణాలపై కేసులు నమోదు చేశారు. తణుకులో నాలుగు బృందాలుగా విడిపోయిన అధికారులు.. దాడులు నిర్వహించి అవకతవకలకు పాల్పడిన 25మందిపై కేసులు నమోదు చేశారు.
ఇవీ చదవండి: