Human Traffic Victims Problems: ఆర్థిక ఇబ్బందులతో కొందరు, ఆదరణ లేక మరికొందరు ఇలా వివిధ కారణాలతో కొంతమంది మహిళలు వ్యభిచార కూపంలోకి దిగుతున్నారు. సమాజంలో సాటి మనిషిగా గుర్తింపు దొరక్క.. అందరి చేత ఛీత్కారానికి గురవుతూ బతుకుతున్నారు. ఇలా మానవ అక్రమ రవాణాలో బాధితులుగా ఉన్న తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఇచ్చి.. మనుషులుగా గుర్తించాలని ఆ మహిళలు కోరుతున్నారు.
తమ కష్టాలను తీర్చమంటూ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. అక్రమ రవాణాలో పట్టుబడిన బాధిత మహిళలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవోలు నీటి మీద రాతలుగా మారాయని, జీవో 1/2003ను జారీ చేసిన ప్రభుత్వం వాటిని అమలు చేయటంలో విఫలమైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదలందరికీ నవరత్నాల పేరుతో లబ్ధి చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే తమను మాత్రం ప్రభుత్వ పథకాల్లో అర్హులుగా చేర్చుకునేందుకు అధికారులు చర్యలు తీసుకోవట్లేదని సెక్స్ వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో 1.33 లక్షల మంది మహిళలు, బాలికలు వ్యభిచార కూపంలో మగ్గుతున్నారని నివేదికలు చెబుతుండగా.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. మహిళా దినోత్సవం రోజున అయినా తమను గుర్తించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. విజయవాడలో విముక్తి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన బాధితులు ఈ మేరకు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
"అక్రమ రవాణాలో బాధితులుగా ఉన్న మహిళలకు న్యాయం జరగాలని ఈ విషయాన్ని మహిళా దినోత్సవం రోజున ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాము. ప్రభుత్వాన్ని కించపరిచే ఉద్దేశంతో మేము మాట్లాడట్లేదు. సెక్స్ వర్కర్లకు నష్ట పరిహారం అందించి వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే అక్రమ రవాణాలో బాధితులుగా ఉన్న మహిళల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తున్నాము." - రజని, వైస్ ప్రెసిడెంట్, విముక్తి ఎన్జీవో
మినిస్టరీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన డాక్యుమెంట్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో 1,35,000 మంది మహిళలు వ్యభిచారంలో కొనసాగుతున్నారు. ఇలా భారతదేశంలో మన రాష్ట్రంలోనే సెక్స్ వర్కర్లు మొదటి స్థానంలో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే.. అక్రమ రవాణా నుంచి బయటపడిన మహిళలకు ఆర్థిక సహాయం, పునరావాసం వంటి వాటిని కల్పించటంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. ఈ కారణంగానే వారు తప్పనిసరి పరిస్థితిల్లో ఈ రోజుకు కూడా బతుకుతెరవు కోసం వ్యభిచార వృత్తిలోనే కొనసాగుతున్నారు. ఫలితంగా వారి పిల్లలు కూడా ఇదే వృత్తిని ఆశ్రయిస్తున్నారు. అయితే ఇలాంటి బాధిత మహిళలకు రేషన్ కార్డు, ఇళ్ల స్థలాలు లాంటి కనీస అవసరాలను ప్రభుత్వం తీర్చాలని కోరుకుంటున్నాము." - రామ్మోహన్, విముక్తి ఎన్జీవో కార్యదర్శి
ఇవీ చదవండి: