Vegetable Crops Drying up Due to Lack of Water: రాష్ట్రంలో కరవు పరిస్థితి రోజురోజుకు అధికమవుతోంది. ఎన్నడూ లేనంతగా వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. ఏ ప్రాంతంలో చూసినా నీటి కోసం ఎదురు చూస్తున్న రైతులే. ఒక్క వాన కురిస్తే.. పంట చేతికొస్తుందనే ఆశతో అన్నదాత ఎదురుచూస్తున్నాడు. అయినా వానల్లేకపోవడంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు అనేత ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు రైతులు బోర్లు, బావులు తవ్వించి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయగా.. మరికొందరు చెరువుల్లో అడుగంటిన బురద నీటినే డీజిల్ ఇంజిన్ల సాయంతో కిలోమీటర్ల కొద్దీ పైపులైన్లు వేసి పంటలకు తడులు ఇస్తున్నారు. ఇలా పంటలకు తడులు ఇవ్వాలంటే అధికంగా ఖర్చు అవుతోందని రైతులు వాపోతున్నారు. వర్షాలు కురవక.. జలాశయాలకు నీరు చేరక.. పంటలు వేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది.
పెట్టుబడి కూడా రాని పరిస్థితి: కొన్ని ప్రాంతాల్లో వర్షాభావంతో పంటలకు నీరందక దెబ్బతినడమే కాకుండా.. దిగుబడులపై ప్రభావం పడింది. పువ్వు రాలిపోయి.. కాయలు రాక రైతులు నిట్టూరుస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టిన కూరగాయల రైతులు.. కనీసం పెట్టుబడి కూడా దక్కేటట్లు లేదని ఆవేదన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొటికలపాడు, మూలపాడు, కేతనకొండ, నయా పోతవరం గ్రామాలు.. కూరగాయలు, ఆకు కూరల సాగుకు పేరుగాంచిన గ్రామాలు . ఈ ఏడాది కూడా పెద్దఎత్తున.. రైతులు కూరగాయ పంటలు సాగు చేశారు.
పంట దిగుబడులపై ప్రభావం: ఈ ఏడాది వర్షాభావంతో సాధారణ పంటల మాదిరిగానే కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. సకాలంలో తగిన నీటి తడులు అందక పంటలు ఎండిపోతున్నాయి. సాగునీరందక.. పూత, పిందె రాక పంట దిగుబడులు తగ్గిపోయాయి. బెండకాయలు, సొరకాయలు, బీరకాయలు, వంకాయలు.. ఇలా అన్ని పంటలదీ ఇదే పరిస్థితి. కాలీఫ్లవర్ పంట దిగుబడులు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. చాలాచోట్ల పంటలకు తెగుళ్లు రావడంతో పంట దిగుబడులపై ప్రభావం పడింది. బెండ పంట అర ఎకరా విస్తీర్ణంలో 4,5 క్వింటాళ్లు రావాల్సిన కాయలు కొన్నిచోట్ల 50,60 కిలోలు కూడా రాలేదు. పూత, పిందె ఎండిపోవడంతో కొన్నిచోట్ల 30, 40 కిలోలు కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.
Chilli Farmers Problems: అందని సాగు నీళ్లు.. పంటకు తెగుళ్లు.. మిర్చి రైతు కన్నీళ్లు
కౌలు చెల్లించేందుకే ఇబ్బందులు: కూరగాయల రైతులకు ఎకరాకు 30 వేల నుంచి 40 వేల రూపాయల వరకు పెట్టుబడులు అవుతున్నాయి. పురుగుమందులు, కూలీ ఖర్చులకు తోడు వర్షాభావం వల్ల బోర్ల నుంచి నీరు తోడుకునేందుకు రైతులు అదనంగా ఖర్చు చేస్తున్నారు. కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయం. ఎకరాకు 23వేల రూపాయలు చొప్పున కౌలు రైతులు చెల్లించాల్సి ఉంటుంది. పంట సాగుకు ఖర్చులు అధికంగా కావడంతో కౌలు చెల్లించడానికే రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది వర్షాభావంతో నష్టాల్లో మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాభావం కొనసాగుతుండగానే రబీ సీజన్‌కు కొందరు రైతులు సిద్ధమవుతున్నారు. కనీసం అప్పటికైనా సమగ్ర ప్రణాళికతో నీటి సౌకర్యం కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.