Variety Ganapathi Idols 2023 in AP : వాడవాడలా గణేష్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా మొదలయ్యాయి. ఎక్కడికక్కడ మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్నగణనాథుడు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాడు.
Ganesh Idol as Chandrayaan-3 Model Attracting People : పార్వతీపురం మన్యం జిల్లాలో కొత్త వలసలో కొలువుదీరిన నారీకేల గణపతి భక్తులను అలరిస్తున్నాడు. 2 వేల కొబ్బరి కాయలతో 15 అడుగుల గణేశుడ్ని ప్రతిష్టించారు. విజయనగరం జిల్లా పొనిగిటివలస గ్రామంలో గతంలో 100 అడుగుల పొడువు గల టైటానికి షిఫ్, 50 అడుగుల ఎత్తుగల ఇండియాగేట్, పుష్కలంగా నీటితో నిండిన చెరువు మధ్యలో మండపం ఏర్పాటు చేశారు. చుట్టు ప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలు గణపతిని తిలకించే విధంగా రూపుదిద్దడం ఆ గ్రామ యువకుల ప్రత్యేకత.
అలాగే ఈ ఏడాది ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన చంద్రయాన్‌తో (Chandrayaan-3 Ganesh)ప్రపంచ దేశాలు మన దేశం వైపు చూసేలా చేసిన శాస్త్రవేత్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ పొనుగుటివలస గ్రామ యువకులు ఒక చిత్రకారుడు సహాయంతో నెల రోజుల నుంచి రాత్రి , పగలు అనే తేడా లేకుండా 50 అడుగుల రాకెట్ నమూనా రూపొందించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరివంక గ్రామంలో పచ్చి పసుపు కొమ్ములతో పర్యావరణహిత వినాయక ప్రతిమను ప్రతిష్టించారు.
Stunning Variety Of Ganesh Idols in Sate : అనంతపురంలో ప్రకృతి సిద్ధంగా తయారు చేసిన గణపతి విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. రంగస్వామి నగర్‌లో మంగళవాయిద్యాలతో స్వాగతం పలికే గణేష్ విగ్రహాలు, కమలానగర్‌లో సర్పాల మధ్య ఉన్న లంబోదరుడు సత్యమేవ జయతే వినాయకుడి ఏర్పాటు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పాతూరులో అశ్వర్థనారాయణ వృక్షం చుట్టూ గణేశుడు ప్రదక్షిణ చేస్తున్న తీరు ఆకట్టుకుంటోంది.
నెల్లూరు జిల్లాలో కొబ్బరికాయలతో, కొబ్బరిపీచుతో, కూరగాయలతో గణనాథుడిని రూపొందించారు. కర్నూలు నగరంలో కళ్లు మూసి తెరిచే గణపయ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 56 అడుగుల మట్టి గణేష్‌ను చూసేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. ఎమ్మిగనూరులో కొండవీటి ప్రాంతంలో ఆముదాలు, కుసుములు, రుద్రాక్షలతో తయారు చేసిన ప్రకృతి వినాయకుడు కొలువుదీరాడు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో వినాయక చవితి సందర్భంగా గోల్డెన్ మర్చంట్ షరాఫ్ బజార్లో మూడు లక్షల అమెరికన్ డైమండ్స్‌తో రూపొందించిన వినాయక విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. దీని కోసం తంజావూర్ నుంచి వచ్చిన ఐదుగురు కళాకారులు 15 రోజుల పాటు శ్రమించారు.
గతంలో వినూత్నంగా నవరత్నాలు, నవధాన్యాలు, డ్రై ఫ్రూట్స్, ముత్యాలు, పగడాలు, లక్ష్మీకాసులతో విగ్రహాలను తయారు చేసిన ఘనత షరాప్ బజార్దే. వీటితో పాటు క్రేజీ గైస్, పాటిమీద, జాగులపాలెం, పద్మశాలి పేట, శ్రీ మిత్ర సముదాయం ఇలా పలుచోట్ల పర్యావరణ పరిరక్షణలోగా మట్టి గణపతులను కూడా ఏర్పాటు చేశారు. మండపాలలో కొలువైన గణనాధులకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. వినాయక చవితి వచ్చిందంటే చిలకలూరిపేటలో వినూత్నంగా రూపొందించే విగ్రహాలతో సందడి నెలకొంది.
Chandrayaan Vinayaka in Vijayawada : విజయవాడలో చంద్రయాన్ వినాయకుడు సందడి చేస్తున్నాడు. చంద్రయాన్ విజయాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేస్తూ వన్ టౌన్ పూజారివీధిలో ఈ విగ్రహాన్ని నెలకొల్పారు. చందమామ ప్రతిమతోపాటు రాకెట్ నమూనాను ఏర్పాటు చేశారు. ఇది ఆబాలగోపాలాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. చంద్రయాన్ వినాయకుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు.
ఇక్కడ కొలువైన బాల వినాయకుడి మూలవిరాట్టును నాలుగు కిలోల బంగారంతో అందంగా తీర్చిదిద్దారు. వినాయక ఉత్సవాల సందర్భంగా మరోసారి చంద్రయాన్ ఖ్యాతిని తెలియజేయడమే చంద్రయాన్ వినాయకుడి ఏర్పాటు లక్ష్యమని నిర్వాహకులు చెప్పారు. బంగారు వినాయకుడు మెరుస్తున్నాడు.