Unemployees Protest: రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా కేంద్రాల్లో ఉన్న ఖాళీగా ఉన్న పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలంటూ నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. విజయవాడ లెనిన్ కూడలి నుంచి ధర్నాచౌక్ వరకూ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ధర్నాచౌక్ వద్ద నిరసనకు దిగారు. 4,765 పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కోరారు.
పశుసంవర్ధక శాఖలో ఏహెచ్‌ఏల భర్తీకి ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినప్పటికీ పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని నిరుద్యోగ అభ్యర్థులు ఆవేదన చెందారు. కొత్తగా క్లస్టర్ విధానాన్ని ప్రవేశపెట్టి 3 నుంచి 5 రైతు భరోసా కేంద్రాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసే చర్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.
దీనివల్ల రైతు భరోసా కేంద్రాల్లో పోస్టులు తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో గత మూడేళ్ల నుంచి ఒకేషనల్, డైరీ డిప్లొమో చదివిన అభ్యర్థులు క్లస్టర్ విధానం వల్ల తీవ్రంగా నష్టపోతారని అన్నారు. గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వస్తుందని, తమకు ఉద్యోగాలు లభిస్తాయనే ఆశతో వేలకు వేలు ఖర్చు చేసి చదివిన నిరుద్యోగ అభ్యర్థులను.. తాజా నిర్ణయాలు నిరాశకు గురిచేస్తున్నాయని అన్నారు.
పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ఈ ఏడాది జనవరిలో క్లస్టర్ విధానం తీసుకొస్తామంటూ ఇచ్చిన సర్క్యులర్‌ను వెంటనే రద్దు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనతో పాటు పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని నిరుద్యోగ అభ్యర్థులు హెచ్చరించారు. డీవైఎఫ్‌ఐ, ఏహెచ్‌ఏ అభ్యర్థుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల నుంచి అభ్యర్థులు విజయవాడ వచ్చి తమ ఆవేదన వ్యక్తం చేశారు.
"2019-20లో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత.. వెటర్నరీలో భారీగా పోస్టులు నిలిచిపోయాయి. ఆ పోస్టులన్నీ భర్తీ చేస్తామని సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తూ.. రెండు సంవత్సరాలు గడిపేశారు. కాగా ఇప్పుడు క్లష్టర్ విధానాన్ని తీసుకుని వచ్చి మైనస్ చూపిస్తున్నారు. దీనివల్ల మేము నిరుద్యోగులగానే మిగిలిపోతాం. మేము చేసిన కోర్స్.. ఈ నోటిఫికేషన్‌కు తప్ప ఎందుకూ ఉపయోగపడదు. కాబట్టి ప్రభుత్వం దీనిపై స్పందించి.. క్లష్టర్ విధానాన్ని రద్దు చేయాలి." - నిరుద్యోగ అభ్యర్థులు
"జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, ఫిబ్రవరిలో వస్తుందని చెప్పి నిరుద్యోగులను సీఎం ఉత్సాహపరిచారు. ఆయన స్టేట్మెంట్లతో మేము కోచింగ్ సెంటర్లకు డబ్బును ధారపోసి.. మూడు నెలలపాటు తల్లీబిడ్డలందరినీ వదిలేసి.. అక్కడకు చదువుకునేందుకు వెళ్లాము. అలా వెళ్లి కోచింగ్ తీసుకుంటున్న క్రమంలోనే క్లష్టర్ విధానాన్ని తీసుకుని వచ్చారు. దయచేసి ప్రభుత్వం మాకు ఏదో చిన్నపాటి ఉద్యోగాన్ని కల్పించి.. మేము చేసిన కోర్స్‌కు ప్రతిఫలాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము." - నిరుద్యోగ అభ్యర్థులు