TRS Won Munugode Bypoll: దేశ రాజకీయాల్లో అత్యంత ఖరీదైన ఎన్నికగా గుర్తింపు తెచ్చుకున్న మునుగోడు ఉపఎన్నికలో.. అధికార పక్షం జయకేతనం ఎగరేసింది. 15 రౌండ్లలో కొనసాగిన ఓట్ల లెక్కింపులో.. సుమారు 10వేలకు పైగా ఓట్ల ఆధిక్యంతో జయకేతనం ఎగురవేశారు. దీంతో అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు సంబురాల్లో మునుగిపోయారు.
ఉదయం 8 గంటలకు మొదటిగా చౌటుప్పల్‌లో మండలంలో అధికారులు ఓట్లు లెక్కింపు చేపట్టారు. ఇక్కడ తొలి రౌండ్‌లో చౌటుప్పల్ గ్రామీణ ఓట్లను లెక్కించారు. తెరాస 1292 ఓట్ల ఆధిక్యంతో భాజపాపై ముందంజలో నిలిచింది. తెరాసకు 6 వేల 418 ఓట్లు రాగా.. భాజపాకు 5 వేల 126 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 2 వేల 100 ఓట్లు పోలయ్యాయి. తర్వాత రెండు, మూడో రౌండ్లలో చౌటుప్పల్ పురపాలిక ఓట్లను లెక్కించారు. ఈ రెండు రౌండ్లలోనూ భాజపా ఆధిక్యత ప్రదర్శించింది.
మూడు రౌండ్లు పూర్తయ్యే సరికి కేవలం 35 ఓట్ల ఆధిక్యంలో కారు అతికష్టం మీద ఆధిక్యతను ప్రదర్శించింది. అనంతరం నాలుగో రౌండ్‌లో... 1034 ఓట్ల తేడాతో తెరాస ముందంజలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే... పోలింగ్ కేంద్రం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓట్ల లెక్కింపు కేంద్రం నుంచి భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి బయటకు రావడంతో... గందరగోళం నెలకొంది. భాజపా గెలిచిన రౌండ్లను.. రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించడం లేదంటూ వికాస్ రాజ్‌కు కిషన్‌రెడ్డి ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్లే.. ఆలస్యం అవుతోందని సీఈవో వివరణ ఇచ్చారు. మంత్రి జగదీశ్‌రెడ్డి సైతం.. రౌండ్ల ప్రకటనలో ఆలస్యంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం పరిస్థితులు నెమ్మదిగా సర్దుకున్నాయి.
రౌండ్ రౌండ్‌కి పెరిగిన ఆధిక్యం: ఒంటిగంటకు తుది ఫలితాలు వస్తాయనుకున్న అధికారుల అంచనాలు తప్పాయి. నాటకీయ పరిణామాల అనంతరం.. సంస్థాన నారాయణపురం మండలానికి సంబంధించి, నాలుగు, ఐదు, ఆరు రౌండ్లలో ఓట్లను లెక్కించారు. ఇక్కడ ఐదు, ఆరు రౌండ్‌లో గులాబీ పార్టీ ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఐదో రౌండ్‌లో 817, ఆరో రౌండ్‌లో 638 ఓట్ల తేడాతో.. భాజపాపై తెరాస ముందంజలో నిలిచింది. అనంతరం మునుగోడు మండలంలో ఆరు, ఏడు, ఎనిమిది రౌండ్ల ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇక్కడ కూడా తెరాస ఆధిక్యతను చూపింది. ఏడో రౌండ్‌లో 399, ఎనిమిదో రౌండ్‌లో 536 ఓట్ల తేడాతో... గులాబీ పార్టీ లీడ్‌లో నిలిచింది. మునుగోడులో భారీ ఆధిక్యాన్ని నమోదు చేసుకుంటామనుకున్న తెరాస శ్రేణుల్లో... కాస్త నిరాశ నెలకొంది. స్వల్ప ఓట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
చండూరు మండలానికి సంబంధించి.. 8, 9, 10 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగింది. ఇక్కడా కారు గుర్తే ముందు వరుసలో నిలిచింది. ఎనిమిదో రౌండ్‌లో 536, తొమ్మిదో రౌండ్‌లో 852, పదో రౌండ్‌లో 484 ఓట్ల ఆధిక్యంతో... తెరాస లీడ్‌లో నిలిచింది. గట్టుప్పల మండలం ఓట్ల లెక్కింపును.. 10, 11 రౌండ్లలో కొనసాగింది. పదకొండో రౌండ్‌లో 1358 ఓట్ల తేడాతో భారీ ఆధిక్యాన్ని తెరాస తెచ్చుకుంది. అప్పటి వరకు ఇరు పార్టీల మధ్య స్వల్ప తేడానే ఉండగా... గట్టుప్పల మండల ఓట్ల లెక్కింపుతో... తెరాస మెజార్టీ అనూహ్యంగా పెరిగింది.
డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. మర్రిగూడ మండలానికి సంబంధించి 11, 12, 13 రౌండ్లలో ఓట్ల లెక్కింపు సాగింది. ఇక్కడా తెరాసనే పై చేయి సాధించింది. 12వ రౌండ్‌లో అత్యధికంగా 2 వేల 42... 13 రౌండ్‌లో తెరాస ఆధిక్యతను చూపింది. 13వ రౌండ్‌లో 1285 ఓట్లతో తెరాస ముందంజలో నిలిచింది. నాంపల్లి మండలం ఓట్లను 13, 14, 15 రౌండ్లలో లెక్కించారు. ఈ రౌండ్లలోనూ తెరాసనే ముందంజలో నిలిచింది. 14వ రౌండ్‌లో 15వ రౌండ్‌లో ఆధిక్యాన్ని తెరాస ప్రదర్శించింది. మొత్తంగా రెండు, మూడు రౌండ్లు మినహా... 1, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 రౌండ్‌లలో ఏకపక్షంగా కారు ముందుకు దూసుకెళ్లింది. చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం మండలాల్లో ఇచ్చిన విధంగా... భాజపా గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా డిపాజిట్‌ను కోల్పోయింది. 7 మండలాల్లో ఒక్క మండలంలోనూ... చెప్పుకోతగిన స్థాయిలో కాంగ్రెస్ ఓట్లు రాబట్టలేకపోయింది.
నాలుగో స్థానంలో... బీఎస్పీ నిలిచింది. ఇక పోస్టల్ బ్యాలెట్‌లోనూ తెరాస, భాజపా మధ్య హోరాహోరీ నెలకొంది. కేవలం 4 ఓట్ల ఆధిక్యతను తెరాస ప్రదర్శించింది. తెరాసకు 228 ఓట్లు రాగా.. భాజపాకు 224 ఓట్లు వచ్చాయి. బీఎస్‌పీకి 10 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఒక్క ఓటు కూడా రాలేదు. కారు గుర్తును పోలిన గుర్తుల వల్లే... మెజార్టీ తగ్గిందని తెరాస శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతీ మేకర్, చెప్పు గుర్తులకు... దాదాపు వెయ్యి చొప్పున ఓట్లు పోలయ్యాయి.
ఇవీ చదవండి: