Jr. NTR Fan Shyam Manikantha Death Updates: డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని.. శ్యామ్ మణికంఠ మరణం ముమ్మాటికీ హత్యేనని.. తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. శ్యామ్ మణికంఠ మృతిపై ఈరోజు విజయవాడలోని టీడీపీ కార్యాలయంలో కొన్ని వీడియో క్లిప్పింగులను ప్రదర్శించింది. అనంతరం శ్యామ్ మణికంఠ అనుమానాస్పద మృతి వెనక ఎవరో ఉన్నారన్న విషయాన్ని పోలీసులు విడుదల చేసిన వీడియోలోనే తెలుస్తోందని తెలుగుదేశం పార్టీ వెల్లడించింది. శ్యామ్‌ని బలవంతంగా బెదిరించి.. వీడియోను రికార్డు చేయించారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని పేర్కొంది.
ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ అనుమానాస్పద మృతి.. ఈ నెల 28వ తేదీన డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని శ్యామ్ మణికంఠ రామ్‌ప్రసాద్ (21) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. శ్యామ్ మణికంఠ మృతిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అతను ఓ సెల్ఫీ వీడియో విడుదల చేసి, ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. కానీ.. శ్యామ్ ఉరివేసుకుంటే కాళ్లు నేలకు ఎలా తాకుతాయి..? శరీరం, ముక్కుపై ఎందుకు గాయాలు ఉంటాయి..? అతని జేబులో గంజాయి ప్యాకెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి..? చేయి కోసుకుంటే ఇంత నిలకడగా ఎలా ఉరి వేసుకుంటాడు..? అనే భిన్న అనుమానాలు స్థానికుల్లో రేకెత్తాయి. శ్యామ్ మణికంఠ రామ్‌ప్రసాద్ మృతికి సంబంధించిన పోస్టులు వైరలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
శ్యామ్ మణికంఠది మూమ్మటికీ హత్యే.. ఈ నేపథ్యంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య శ్యామ్ మణికంఠ రామ్‌ప్రసాద్ (21) మృతిపై మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన శ్యామ్ మణికంఠ మరణానికి సంబంధించిన కొన్ని వీడియో క్లిప్పింగులను ప్రదర్శించారు. అనంతరం వర్ల రామయ్య మాట్లాడుతూ..''శ్యామ్ మృతిపై దర్యాప్తు పూర్తికాక ముందే ఆత్మహత్య అని పోలీసులు ఎలా చెబుతారని..? పోస్టు మార్టం చేసిన వైద్యుడు సర్టిఫికెట్ ఇవ్వకముందే శ్యామ్ ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పడం తగదు. బయటికొచ్చిన శ్యామ్ సూసైడ్ వీడియో ఒరిజినల్ కాదు.. అది వైసీపీ సోషల్ మీడియా ఎడిట్ చేసిన వీడియో.. శ్యామ్ వీడియోలో మాట్లాడుతున్నప్పుడు అతనితో పాటు వేరొక వ్యక్తి ఉన్నారు. బలవంతంగా బెదిరించి వీడియో రికార్డు చేయించారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. వీటన్నింటినీ స్పష్టంగా గమనిస్తే.. శ్యామ్ మణికంఠ రామ్‌ప్రసాద్ (21) మరణం ముమ్మాటికీ హత్యే అని తెలుస్తోంది. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు సరైనా విచారణ జరిపి.. వాస్తవాలను ప్రజలకు, ఆ కుటుంబ సభ్యులకు తెలియజేయాలి. దీంతోపాటు ఈ హత్య వెనక ఉన్నది ఎవరో కూడా దర్యాప్తు చేపట్టాలి'' అని ఆయన అన్నారు.