Thota Chandrasekhar : తెలంగాణ రాష్ట్ర నమూనా అభివృద్ధిని మన రాష్ట్రంలోనూ తీసుకొస్తామని భారతీయ రాష్ట్ర సమితి రాష్ట్ర అధ్యక్షులు తోట చంద్రశేఖర్ తెలిపారు. విజయవాడ వచ్చిన ఆయన.. మొదట బందరు రోడ్డులోని వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు రంగా ఎంతో సేవ చేశారని కొనియాడారు. దేశంలో చాలా సమస్యలున్నాయని.. రైతాంగం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. నిరుద్యోగం పెరిగిపోతోందని అన్నారు. స్వాతంత్య్రంవచ్చి 75 ఏళ్ళు అవుతున్నా తాగునీరు, సాగునీటి సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు.
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత ఎన్నో సమస్యలు ఇంకా నెరవేరకుండా ఉన్నాయని.. రాష్ట్రానికి రాజధాని లేదని, పోలవరం ప్రాజెక్ట్ పూర్తి కాలేదని.. విభజన హామీలను కేంద్రం తీర్చడం లేదని విమర్శించారు. దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, విశాఖ రైల్వే జోన్ విషయంలో నిర్లక్ష్యం కనబరుస్తోందని అన్నారు. మేము అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలోనే.. అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని.. తోట చంద్రశేఖర్ అన్నారు. పాలకుల అసమర్థతతోనే అమరావతికి అంతర్జాతీయ గుర్తింపు రావట్లేదు, అభివృద్ధికి నోచుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్లో చేరేందుకు ఇతర పార్టీ నేతలు ఉత్సాహం చూపిస్తున్నారన్న ఆయన.. ఎన్నికల సమయంలోనే పొత్తుపై స్పష్టత వస్తుందన్నారు. రైతులు, నిరుద్యోగ సమస్యలే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. ఎన్నికల సమయంలోనే పొత్తుల గురించి ఆలోచిస్తామన్నారు. విజయవాడ, విశాఖ మెట్రో రైలు సౌకర్యం లేదని.. కేంద్రాన్ని అడిగేవాళ్లు లేరు.. నిలదీసేవాళ్లు లేరని అన్నారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా భారత రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో ముందడుగు వేస్తుందనే ధీమాను వ్యక్తం చేశారు.
గత తొమ్మిది సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఏంతో అన్యాయం చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు అని చెప్పకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. ఎందుకంటే ఎక్కడకు వెళ్లినా మీ రాజధాని ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి. అలానే విభజన తర్వాత ఎన్నో హామీలు అమలు చేయడంలో జాప్యం జరుగుతోంది. మనకు జీవవాడి అయినటువంటి పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇవ్వక పోవటం దానిని ముందుకు తీసుకువెళ్లడానికి ఎటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావడం లేదు.- తోట చంద్రశేఖర్, బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు
ఇవీ చదవండి :