TDP leaders on government policies: జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలపై తెలుగుదేశం నేతలు మీడియా ముందుకు వచ్చారు. ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. సంక్రాంతి సంబరాల పేరుతో రాష్ట్రాన్ని జూదశాలగా మార్చాడని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య మండిపడగా.. జగన్ గత నాలుగు సంవత్సరాలలో ఎన్ని పరిశ్రమలు తీసుకు వచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలని బోండా ఉమామహేశ్వరావు డిమాండ్ చేశారు. దళితులకు ముఖ్యమంత్రి చేస్తున్న ద్రోహంపై అధికారులు స్పందించాలని నక్కా ఆనంద్ బాబు డిమాండ్ చేశారు.
బోండా ఉమామహేశ్వరరావు: నాలుగేళ్లలో జగన్ తీసుకువచ్చిన పరిశ్రమలపై శ్వేత పత్రం విడుదల చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. జగన్ అవినీతి దెబ్బకు పారిశ్రామికవేత్తలు ఏపీకి రావాలంటే వణికి పోతున్నారన్నారు. దావోస్ పర్యటనకు వెళ్లకుండా ఏపీ ఐటీ మంత్రి కోడిపందేలు, పేకాట ఆడుతున్నారని విమర్శించారు. దావోస్ పర్యటనకు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 9సార్లు వెళ్లి ఏపీకి వేలాది కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని గుర్తుచేశారు. దావోస్ లో ఇప్పుడు సదస్సులు జరుగుతుంటే పక్క రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెళ్లారని తెలిపారు.. పరిశ్రమలు తెలంగాణకు తీసుకువెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో జగన్ ఏపీకి తీసుకువచ్చింది పిచ్చి మందు, ఫిష్ మార్కెట్లు మాత్రమేనని బోండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు.
నక్కాఆనంద్‌బాబు: దళితులకు తానుచేస్తున్న ద్రోహంపై దళితమంత్రులు ప్రశ్నించకపోయినా.. అధికారులైనా స్పందించాలని.. మాజీమంత్రి నక్కా ఆనంద్‌బాబు కోరారు. మూడున్నరేళ్లలో కేంద్రం నుంచి ఎస్సీ, ఎస్టీల ఉపకారవేతనాలకు రూ.4,500కోట్లు వచ్చాయన్న ఆయన.. వాటిలో రూ. 2,000కోట్లు సబ్ ప్లాన్ కింద వాడాల్సి ఉండగా... ఆ నిధుల్ని సైతం జగన్ రెడ్డి దారిమళ్లించాడని విమర్శించారు. జీవోనెం-77తో పీజీ విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు లేకుండా చేసిన దుర్మార్గుడు జగన్ రెడ్డి అంటూ నక్కా ఆనంద్‌బాబు మండిపడ్డారు.
గోరంట్ల బుచ్చయ్యచౌదరి: సంక్రాంతి సంబరాల పేరుతో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి విషసంస్కృతిని తీసుకొచ్చారని టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధ్వజమెత్తారు. సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన రాష్ట్రాన్ని జగన్ రెడ్డి జూదశాలగా మార్చాడన్నారు. జూదాలు, కోడిపందేలు, గుండాట ముసుగులో వైసీపీ నేతలు రూ.300కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. గన్నవరంలో తెల్లారేవరకు అశ్లీల నృత్యాలు జరిగినా పోలీసులకు కనిపించలేదా అంటూ గోరంట్ల బుచ్చయ్యచౌదరి మండిపడ్డారు.
ఇవీ చదవండి: