Chandrababu on MLC Election Results: ఆంధ్రప్రదేశ్లో ప్రజల మద్దతు తెలుగుదేశం పార్టీ పక్షానే ఉందని.. అది ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారానే తేలిందని.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్ఠం చేశారు. ఈ ఫలితాల స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకూ ప్రతి ఒక్కరూ కష్టపడాలని.. పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో పార్టీ శాసనసభ పక్ష సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల గురించి, సీఎం జగన్ దిల్లీ పర్యటన గురించి, అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలు, పార్టీ కార్యకలాపాల గురించి సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలు మార్పును కోరుకుంటున్నారనే విషయం నేడు వెల్లడవుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ద్వారా తెలుస్తోందన్నారు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్థుల స్ఫూర్తితో 2024వ సంవత్సరంలో రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇప్పటి నుంచే ప్రతి నాయకుడు రాత్రీపగలు కష్టపడాలని సూచించారు. 2024లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు.
అనంతరం అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన ఎమ్మెల్యేలకు పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో ప్రలోభాలకు గురి చేసినా ఓటర్లు మాత్రం లొంగలేదని చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో అందరికీ అర్థమైందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల స్ఫూర్తితో సాధారణ ఎన్నికల వరకూ ప్రతి ఒక్కరూ కష్టపడాలని నేతలకు పిలుపునిచ్చారు. హడావుడిగా దిల్లీ వెళ్లిన సీఎం జగన్.. రాష్ట్రానికి ఏం తెస్తారో ఈసారైనా చెబుతారా? అని నిలదీశారు. సమావేశంలో ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్ర రావు జన్మదినం సందర్భంగా చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
మరోవైపు 'బైబై జగన్ 2024' అనే హ్యాష్ ట్యాగ్ సామాజిక మాధ్యమల్లో తెగ ట్రెండింగ్ అవుతోంది. దేశవ్యాప్తంగా 'బైబై జగన్ 2024' అనే హ్యాష్ ట్యాగ్ మూడో స్థానంలో కొనసాగుతోందని సోషల్ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు భారీ విజయం దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో సుమారు 23వేల ట్వీట్లతో వైసీపీకి వ్యతిరేకంగా '#ByeByeJaganIn2024' హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్లో దూసుకుపోతోంది.
ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల విషయానికొస్తే.. 'నువ్వా..నేనా' అన్న రీతిలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య పోటీ సాగుతోంది. రాష్ట్రంలోని 9 ఉమ్మడి జిల్లాలు, 108 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో జరిగిన పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉత్తరాంధ్రతో పాటు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పటివరకూ వెల్లడైన రౌండ్లలో తెలుగుదేశం పార్టీ సత్తా చాటుతోంది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి టీడీపీ అభ్యర్థులు భారీ ఆధిక్యంలో ఉన్నారు.
ఇవీ చదవండి