Gali Janardhan Reddy : గాలిజనార్దన్ రెడ్డికి గనులు కట్టబెట్టడంలో అప్పటి గనులశాఖ డైరెక్టర్ వి.డి. రాజగోపాల్ కీలకపాత్ర పోషించారని సీబీఐ తెలిపింది. రాజగోపాల్ గనులశాఖ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించడానికి 20 రోజుల ముందే, ఆయన బావమరిది ఓబులాపురం మైనింగ్ కంపెనీలో ఉద్యోగంలో చేరారని సీబీఐ వెల్లడించింది. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిపై అవినీతి నిరోధక చట్టం కింద సెక్షన్ వర్తించదంటూ.. ఇచ్చిన కోర్టు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించనున్నట్లు సీబీఐ తెలిపింది.
సీబీఐ కోర్టు డిశ్చార్జి పిటిషన్ కొట్టివేయడాన్ని సవాల్ చేస్తూ రాజగోపాల్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. లీజు నిమిత్తం వచ్చిన దరఖాస్తులన్నీ పరిశీలించాల్సి ఉన్నా.. మొదట వచ్చాయంటూ ఓఎమ్సీ, వినాయక మైనింగ్ దరఖాస్తులను మాత్రమే రాజగోపాల్ పరిశీలించి ఓఎమ్సీకి లీజు కట్టబెట్టారని తెలిపారు. అందుకే ఆయన పిటిషన్ కొట్టివేయాలని కోరారు. అయితే రాజగోపాల్ విధులు చేపట్టే నాటికే గనుల లీజు నోటిఫికేషన్ జారీ అయ్యిందని.. దరఖాస్తులు అందాయని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫోర్జరీ కింద అభియోగం మోపినా ఎలాంటి ఆధారాలు చూపలేదని రాజగోపాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న తెలంగాణ హైకోర్టు విచారణను ఈనెల 10 వ తేదీకి వాయిదా వేసింది.
ఇవీ చదవండి :