Teachers Unions Fire on AP Govt on GPS issue: జీపీఎస్‌కు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఏకమవుతున్నాయి. విజయవాడలోని యూటీఎఫ్ కార్యాలయంలో సమావేశమైన.. యూటీఎఫ్, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ నేతలు జీపీఎస్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేట్ శక్తుల కోసమే జీపీఎస్‌ను తెరపైకి తెచ్చారని ఆరోపించారు. పాత పెన్షన్ విధానం తప్ప.. మరోదాన్ని ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. మరో వారం రోజుల్లో.. తమతో కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమం చేపడతామని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రకటించారు.
CPS should Be Abolished Immediately: ఉపాధ్యాయులు మరోసారి బీఆర్టీఎస్ రోడ్డు దగ్గర ఉద్యమం చేసే పరిస్థితి రాకుండా చూసుకోవాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. సీపీఎస్ రద్దు కోసం ఏపీ సీపీఎస్ఈఏ, ఏపీ సీపీఎస్ యూఎస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న చేపట్టనున్న ఆందోళనలకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని నేతలు పేర్కొన్నారు. సీపీఎస్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని తోటి ఉద్యోగ సంఘాలు ఇప్పటికైనా గుర్తించాలని హితవు పలికారు.
Teachers Unions Meet On Cancellation Of CPS: సీపీఎస్ రద్దు కోసం ఏ సంఘం ఆందోళన చేసినా.. తాము మద్దతు ఇస్తామని ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎస్.చిరంజీవి, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎల్.సాయి శ్రీనివాస్‌లు తెలిపారు. సీపీఎస్ విషయంలో ప్రభుత్వం ఉపాధ్యాయ సంఘాలను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీపీఎస్ విధి విధానాలపై సమావేశమని పిలిచి.. ప్రభుత్వం మాయ చేస్తుందని, అందుకే తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న చర్చలకు హాజరుకావడం లేదని తేల్చిచెప్పారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్న జగన్.. నాలుగేళ్లు దాటినా ఆ ఊసే ఎత్తడంలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడ్డారు.
Venkateshwarlu comments: యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ..''సెప్టెంబర్ 1వ తేదీన నిర్వహించబోయే చలో విజయవాడకు మా వైపు నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుంది. అన్ని జిల్లా కేంద్రాల్లో చేపట్టబోయే ధర్నాలకు కూడా మా మద్దతు ఉంటుంది. ప్రభుత్వంపై పోరాటమేగానీ.. ఉద్యోగ సంఘాలతో కాదు. మమ్మల్ని మభ్యపెట్టాలని చూస్తే సహించం. బీఆర్‌టీఎస్ రోడ్డు వద్ద చేపట్టిన తరహాలో మరో ఉద్యమం చేసే పరిస్థితిని తీసుకురావద్దని ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను'' అని ఆయన అన్నారు.
Chiranjeevi comments: ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చిరంజీవి మాట్లాడుతూ.. ''మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే చెప్పే సీఎం జగన్.. ఓపీఎస్ హామీ అమలు చేయకుండా మాట తప్పి, మడమ తిప్పేశారు. జీపీఎస్‌పై ఆర్డినెన్స్ తెస్తున్నా.. ప్రభుత్వం ముసాయిదాను ఎందుకు బయటపెట్టడం లేదు..? ఈ పింఛన్ విధివిధానాలు, మారదర్శకాలను ఎందుకు ఇవ్వడం లేదు..?, దేశానికి ఆదర్శమైన పింఛన్ పథకమైనప్పుడు ఉద్యోగులకు జీపీఎస్ మారదర్శకాలు ఇవ్వడంలో అభ్యంతరం ఏంటి..?, సీపీఎస్ ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలోని మొత్తం తీసేసుకొని, బేసిక్‌పై 50శాతం పింఛన్ ఇస్తే గ్యారెంటీ ఏం ఉంటుంది..?'' అని రాష్ట్ర ప్రభుత్వంపై ప్రశ్నల వర్ష కురిపించారు. సెప్టెంబర్ 1న చేపట్టిన సీపీఎస్ ఆందోళనల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Prathidwani: సీఎం జగన్ చెబుతున్నట్లు సీపీఎస్ రద్దు చేయటం అసాధ్యమా?
వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత ఇప్పుడు గ్యారెంటీ పింఛన్ పథకం అంటూ ఉద్యోగులను మోసం చేస్తోంది. సెప్టెంబరు 1న సీపీఎస్ ఉద్యోగులు నిర్వహించే ఆందోళనలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఉద్యోగులపై జీపీఎస్‌ను బలవంతంగా రుద్దుతున్నారు. సీపీఎస్‌లో ప్రభుత్వం 14 శాతానికి పెంచాలని 2019లో కేంద్రం సూచించినా దీన్ని అమలు చేయడం లేదు. ఓపీఎస్ కోసం ఉద్యమాలు చేస్తే జగన్ ప్రభుత్వం కేసులు పెట్టి భయపెడుతోంది. ఇప్పటికే ఉపాధ్యాయులపై 5 వేల వరకు బైండోవర్ కేసులు పెట్టారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. వచ్చే ఎన్నికల్లో ఓపీఎస్ అమలు చేస్తామన్న పార్టీలకే ఓట్లు వేస్తాం.- సాయి శ్రీనివాస్, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు