TDP on Jayaho BC Sabha: తెలుగుదేశం బీసీల పార్టీ.. అందరి పార్టీ అంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్ల తర్వాత జగన్కు బీసీలు గుర్తుకు వచ్చారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. బీసీలకు ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్ చేశారని ఆరోపించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు తెలుగుదేశం కల్పించిన 34శాతం రిజర్వేషన్లు 24శాతానికి తగ్గించినందుకు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సబ్ ప్లాన్ నిధులు మళ్లించడం బీసీలకు ద్రోహం చేయడం కాదా అని ప్రశ్నించారు. బీసీ నేతల్ని, కార్యకర్తల్ని చంపించిన జగన్ జయహో బీసీ సభ నిర్వహించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు.
బీసీల బతుకుల్ని సీఎం జగన్ చట్టబద్ధంగా నాశనం చేశారని తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. చంద్రబాబు రోడ్ షోకు వచ్చిన ప్రజా స్పందనను చూసిన తర్వాతే జగన్కు బీసీలు గుర్తుకు వచ్చారని ఎద్దేవా చేశారు. జగన్ అవలంభిస్తున్న బీసీ మోసపూరిత విధానాలను ప్రజలందరికీ తెలియజేస్తామంటూ కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ వద్ద టీడీపీ నేతలు ధర్నా చేశారు. "ఇదేం ఖర్మ బీసీలకు" అంటూ నినాదాలు చేశారు.
తెలుగుదేశం నేత దాట్ల బుచ్చిబాబు ఆధ్వర్యంలో.. ఇదేం ఖర్మ బీసీలకు అంటూ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో టీడీపీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. విశాఖ కలెక్టరేట్ వద్ద తెలుగుదేశం బీసీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బీసీలకు జగన్ ద్రోహం చేశారంటూ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు అనకాపల్లి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందించారు.
జగన్ బీసీలకు ద్రోహం చేశారంటూ శ్రీకాకుళంలో కలెక్టరేట్ వరకు తెలుగుదేశం నేతలు నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తతకు దారి తీసింది. మాజీ ఎమ్మెల్యేలు కూన రవికుమార్, గుండ లక్ష్మీదేవిని పోలీసులు స్టేషన్ కు తరలించారు. తెలుగుదేశం కార్యక్రమాలకు వస్తున్న ప్రజాస్పందనతో భయపడిన సీఎం.. జయహో బీసీ పేరుతో కొత్త నాటకాలు మొదలు పెట్టారని విజయనగరం నేతలు విమర్శించారు. కడపలో ఇదేం ఖర్మ బీసీలకు అంటూ కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. నెల్లూరు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు టీడీపీ బీసీ నాయకులు ర్యాలీ చేశారు.
ఇవీ చదవండి: