TDP-Left parties on second preference vote in AP: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా టీడీపీ - వామపక్షాలు కలిసి ఉమ్మడి గా కృషి చేయాలని నిర్ణయించాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తమ అభ్యర్థులకు, రెండో ప్రాధ్యాన్యం పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని తెలుగుదేశం నిర్ణయించింది. తమ రెండో ప్రాధాన్యం ఓటు తెలుగుదేశం అభ్యర్థులకు వామపక్షాలు వేసేలా పరస్పరం ఒక అవగాహనకు వచ్చినట్లు ప్రకటించాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తపడాలని నిర్ణయం తీసుకున్నట్లు రెండు పార్టీలు వెల్లడించాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లా బనగానపల్లెలో ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చె నాయుడు పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్చెనాయుడు మాట్లాడుతూ... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వ నాశనం చేశారని ఆరోపించారు. చివరకు రాజధాని లేని రాష్ట్రంగా మార్చి.. ఆంధ్రప్రదేశ్ అంటే దేశ ప్రజలు అసహ్యించుకునే పరిస్థితిని తీసుకొచ్చారని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులను డబ్బులతో కొనాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఓటుకు రూ. 5 వేల నుంచి పదివేల వరకు ఫోన్‌పే ద్వారా డబ్బులు పంపిస్తున్నారని విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు కలిసి అధికార వైసీపీ అభ్యర్థులను ఓడించాలని సీపీఐ నేత రామకృష్ణ కర్నూలులో కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. చివరికి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం అధికార దుర్వినియోనికి పాల్పడుతున్నారని రామకృష్ణ అన్నారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎన్నికలకు సంబంధించి కర్నూలు నగరంలోని ఎస్టీయూ భవన్లో ఉపాధ్యాయ సంఘం నేతలు, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పీడీఎఫ్ అభ్యర్థికి వామపక్ష నాయకులు మొదటి ప్రాధాన్యత ఓటు వేస్తూ రెండో ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వేయాలని కోరారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఓటర్లు మొదటి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు వేసి రెండో ప్రాధాన్యత ఓటును పీడీఎఫ్ అభ్యర్థులకు వేయాలని రామకృష్ణ కోరారు. అధికార పార్టీ నాయకులు ఈ ఎన్నికల్లో దొంగ ఓట్లను చేర్చారని.. ఈ విషయం తిరుపతిలో బయట పడిందన్నారు. ఓట్లను డబ్బుతో కొనాలని చూస్తున్నారని.. అందుకే అభ్యర్థులు అందరూ కలిసిమెలిసి అధికార పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: