TDP Leaders Worried about Chandrababu Health: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఆరోగ్యం పట్ల.. ఆ పార్టీ నేతలు బొండా ఉమామహేశ్వరరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి పీతల సుజాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జైలులో చంద్రబాబు ఇబ్బంది పడుతుంటే తాడేపల్లిలో సీఎం రాక్షస ఆనందం పొందుతున్నారని దుయ్యబట్టారు. జగన్‌కు, వైసీపీకి జైల్ అనేది పుట్టినిల్లు లాంటిదని విమర్శించారు.
Bonda Uma Comments: చంద్రబాబుపై ఆరోగ్యం పట్ల అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు చేస్తోన్న వ్యాఖ్యలపై.. టీడీపీ బొండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయ మాట్లాడుతూ..''చంద్రబాబు జైలుకి వెళ్లేముందు 72 కిలోలు ఉన్నారు. ఒక నెలలో ఆయన 5 కిలోల బరువు తగ్గారు. జైలులో ఉన్న అపరిశుభ్ర వాతావరణం వల్లే చంద్రబాబు బరువు తగ్గారు. కుటుంబ సభ్యులను చంపే చరిత్ర ఎవరికి ఉంది..? అనేది రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని చంద్రబాబుని ఎయిమ్స్‌కు తరలించేలా చర్యలు తీసుకోవాలి. జైలులో చంద్రబాబు ఇబ్బంది పడుతుంటే.. తాడేపల్లిలో సీఎం రాక్షస ఆనందం పొందుతున్నారు. జగన్‌కు, వైసీపీకి జైల్ అనేది పుట్టినిల్లు లాంటిది.'' అని ఆయన అన్నారు.
Gorantla Buchaiah Chaudhary Comments: చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై.. తెలుగుదేశం సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం నిజాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయన ఆరోగ్యంపై సరైన సమాచారం ఇవ్వడం లేదని, చంద్రబాబు ఆరోగ్యంపై అనుమానాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
''సీఎం జగన్ పని అయిపోయింది. ప్రెస్టేషన్‌లో ఉన్నారు. దోచుకోవడం.. దాచుకోవడం తప్ప సజ్జలకు ఏం తెలుసు. చంచలగూడ జైల్లో మీకు సకల సౌకర్యాలు కల్పించలేదా..?. చంద్రబాబు ఆరోగ్యంపై ప్రభుత్వం ఇలాగే వ్యవహరిస్తే వేల మంది మహిళలు తాడేపల్లి ప్యాలస్‌ను ముట్టడించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.'' -గోరంట్ల బుచ్చయ్య చౌదరి, తెలుగుదేశం సీనియర్ నేత
Pithala Sujata comments: తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టి, వైసీపీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. మాజీ మంత్రి పీతల సుజాత ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యంపై రాష్ట్ర ప్రజల్లో, టీడీపీ కార్యకర్తల్లో తీవ్రమైన ఆందోళన ఉందని అన్నారు. చంద్రబాబుకు ఏదైనా జరిగితే.. సీఎం జగన్‌కు తగిన గుణపాఠం చెబుతామని పీతల సుజాత హెచ్చరించారు. ఆలస్యంగా చేయకుండా చంద్రబాబు నాయుడిని వెంటనే సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి, వైద్య సేవలు అందించాలని ఆమె డిమాండ్ చేశారు.