TDP Continues Agitation Against Chandrababu Naidu Arrest : చంద్రబాబు అరెస్టుపై ప్రజాగ్రహ జ్వాలలు చల్లారడం లేదు. చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ శ్రేణులు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ప్రకాశం జిల్లా పామూరు మండలం మోపాడు రిజర్వాయర్ వద్ద టీడీపీ నేతలు వినూత్నంగా ఆందోళన చేపట్టారు. బాబును తక్షణమే విడుదల చేయాలంటూ నీటిలో నిలబడి నిరసన తెలిపారు. నిరాధారమైన ఆరోపణలతో బాబును వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
TDP Leaders Protest Against CBN Arrest : చేయని తప్పుకు చంద్రబాబును అక్రమంగా జైల్లో పెట్టారని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు జైలు నుంచి క్షేమంగా తిరిగిరావాలంటూ 'బంద విమోచన యాగం' చేపట్టారు.
Babu Tho Nenu Program in AP : వైఎస్సార్ జిల్లా మైదుకూరులో తెలుగుదేశం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. బాబుతో నేను సైతం అంటూ నేతలు నినాదాలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రొద్దుటూరులో తెలుగు తమ్ముళ్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు పన్నినా చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారని నేతలు ధీమా వ్యక్తం చేశారు.
సైకో పోవాలి... సైకిల్ రావాలంటూ నినాదాలు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేశారు. చంద్రబాబు నాయుడిని విడుదల చేయాలని నినాదాలు చేశారు. "సైకో పోవాలి సైకిల్ రావాలని" నినదించారు. బాబుతో మేము సైతం అంటూ సత్యసాయి జిల్లా కదిరిలో తెలుగుదేశం రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్న జగన్‌కు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారని నేతలు హెచ్చరించారు.
పదో రోజూ రిలే దీక్షలు : చంద్రబాబుకు మద్దతుగా పార్టీలకు అతీతంగా నేతలు రోడ్డెక్కుతున్నారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో పదో రోజూ తెలుగుదేశం నేతలు రిలే దీక్షలను కొనసాగిస్తున్నారు. నాయీ బ్రహ్మణ సంఘం సభ్యులు, ఎలక్ట్రికల్ వర్కర్లు సంఘీభావం తెలిపారు. యానాం పారిశ్రామికవేత్తలు కూడా నిరసనకు మద్దతు తెలిపారు. మహనీయుడు, విజనరీ నేతను అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని యానాం ఇండస్ట్రీస్ సెక్రెటరీ విష్ణువర్ధన్ రావు మండిపడ్డారు.
బాయ్ బాయ్ జగన్ అంటూ నినాదాలు : కోనసీమ జిల్లా రావులపాలెంలో బీసీ సంఘం నాయకులు వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. నల్ల వస్త్రాలు ధరించి కుల వృత్తుల పని ముట్లు తీసుకువచ్చి నిరసన తెలిపారు. బాబు అరెస్టును నిరసిస్తూ జనసేన నేతలు ర్యాలీ చేపట్టారు. టీడీపీ దీక్ష శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. బాయ్ బాయ్ జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. తెలుగుదేశం జనసేన కలిసి జగన్‌ను ఇంటికి పంపుతామని నేతలు తెలిపారు.
రాజమండ్రి జైల్లో చంద్రబాబు భద్రత పట్ల నేతల ఆందోళన : తూర్పు గోదావరి జిల్లా సత్యవాడలో మాజీ ఎమ్మెల్యే శేషారావు ఆధ్వర్యంలో సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలకు తెలుగు మహిళలు, జనసేన నాయకులు సంఘీభావం తెలిపారు. జగన్ అవినీతి రాజకీయాలను ప్రజల్లో ఎండ గడతామని నేతలు స్పష్టం చేశారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు భద్రత పట్ల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు.
అర్థనగ్నంగా దీక్ష : పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పదో రోజు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, రాష్ట్ర ఖాదీ బోర్డు మాజీ చైర్మన్ దొమ్మేటి వెంకట సుధాకర్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అర్థనగ్నంగా దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు బయటకు వస్తే జగన్ కుట్రలు సాగవనే కేసులు మీద కేసులు పెట్టి చంద్రబాబును వేధిస్తున్నారని ఆరిమిల్లి రాధాకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చంద్రబాబు అక్రమ అరెస్టుపై మాట్లాడేందుకు అవకాశమివ్వకపోవడం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
చంద్రబాబును విడుదల చేసే వరకు పోరాడుతాం : చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఉత్తరాంధ్రలోనూ తెలుగుదేశం నేతలు నిరసనలు చేపట్టారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో టీడీపీ నేతలు, దళిత సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం దీక్షా శిబిరం వద్దకు ర్యాలీ నిర్వహించారు. బాబును విడుదల చేసే వరకు పోరాడుతామని నేతలు స్పష్టం చేశారు.
పాదయాత్రలో పాల్గొనకుండా పోలీసుల ఆంక్షలు : చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి సింహాచలం వరకూ తెలుగుదేశం తలపెట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. బొబ్బిలిలోని వేణుగోపాల స్వామి ఆలయం నుంచి సింహాంద్రి అప్పన్న ఆలయానికి పాదయాత్ర చేపట్టాలని తెలుగుదేశం పిలుపును ఇచ్చింది. అటు టీడీపీ నేతలు పాదయాత్రలో పాల్గొనకుండా పోలీసులు ఆంక్షలు విధిచారు. ఆ పార్టీ నేతలను ముందస్తు అరెస్టు చేశారు. బొబ్బిలి టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బేబి నాయనను అరెస్చు చేశారు.
బొబ్బిలి కోటలోకి ప్రవేశించిన పోలీసులు బలవంతంగా ఆయన్ను వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. బేబి నాయనను తరలిస్తున్న వాహనాన్ని తెర్లాంలో తెలుగుదేశం కార్యకర్తలు అడ్డుకున్నారు. అక్కడి నుంచి బేబినాయను పోలీసులు బుదరాయునివలస స్టేషన్‌కు తరలించారు. అరెస్టు చేసిన మరికొందరు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులను బొబ్బిలి పోలీస్ స్టేషన్‌లో ఉంచారు.
ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం దారుణం : చంద్రబాబు అరెస్ట్‌ని నిరసిస్తూ, జైల్లో ఆయన భద్రతకు సరైన ఏర్పాట్లు చేయకపోగా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించడం దారుణమని, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరిధిలోని జీవీఎంసీ 83వ వార్డులో ఏర్పాటైన నిరసన దీక్షలో ఆయన పాల్గొన్నారు.