Fake Votes In MLC Election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ అక్రమాలను అడ్డుకోవడంతో పాటు ఎన్నికలను మార్చి 15 లోగా పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాను టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్యెల్సీ అభ్యర్థులు రాంగోల్ రెడ్డి, శ్రీకాంత్ లు కలిశారు. ఇంటర్మీడియట్ పరీక్షల నేపధ్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ మార్చి 15 లోగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
తిరుపతిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతో ఓటర్లుగా నమోదు చేసుకుంటున్నారని అశోక్ బాబు ఆరోపించారు. ఎన్నికలకు పది రోజుల ముందు కూడా ఓటు నమోదు చేసుకొనే అవకాశం ఉండటంతో నకిలీ ఓటర్లను అడ్డుకోవడం కష్టంతో కూడిన పని అని పేర్కొన్నారు. నకిలీ ఓట్లు నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటర్లు అందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు గాను ఆదివారం ఎన్నికలు నిర్వహించాలని కోరామన్నారు. పని దినాల్లో ఉద్యోగస్తులు ఓటు హక్కు వినియోగించుకొనేందుకు ఇబ్బందులు ఉంటాయన్నారు.
ఇవీ చదవండి