\TDP Anam Venkata Ramana Reddy on TTD: తిరుమల తిరుపతి దేవస్థానం అధికారపార్టీ నేతల అవినీతికి అడ్డాగా మారిందని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ధ్వజమెత్తారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవరెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి పరిధిలో ఏ పనికైనా 10శాతం కమీషన్ తీసుకుంటున్న భూమన కరుణాకర్ రెడ్డిని ఇప్పటికే 10శాతం కరుణాకర్ రెడ్డిగా పిలుస్తున్నారంటూ విమర్శించారు.
Anam Fire on YCP Leaders: టీటీడీ ఉద్యోగులకు కేటాయించిన స్థలాల చుట్టూ అభినవ రెడ్డి 5.45ఎకరాలు ఎలా కొనుగోలు చేశాడో కరుణాకర్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆనం వెంకటరమణా రెడ్డి డిమాండ్ చేశారు. తిరుమల శ్రీవారి సొమ్ము తిన్న ప్రతి రూపాయి తెలుగుదేశం అధికారంలోకి రాగానే కక్కిస్తామని హెచ్చరించారు. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో టీటీడీలో ధర్మారెడ్డి వ్యవహారం అలానే ఉందని దుయ్యబట్టారు. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద దిల్లీలో క్రిమినల్ కేసు నమోదైందని, తనపై ఉన్న క్రిమినల్ కేసుని దాచిపెట్టి ధర్మారెడ్డి టీటీడీ ఈవో అయ్యాడని మండిపడ్డారు.
అదే అవినీతి టీటీడీలో చేయడని నమ్మకం ఏంటని నిలదీశారు. ఐఏఎస్‌లను కాదని, క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారంటూ మండిపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అడ్డంపెట్టుకుని దిల్లీలో ధర్మారెడ్డి లాబీయింగ్ చేస్తున్నాడని ఆరోపించారు. దిల్లీలో నమోదైన కేసుపై తీర్పు వచ్చే వరకూ ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలని ఆనం వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు.
"అధికారపార్టీ నేతల అవినీతికి టీటీడీ అడ్డాగా మారింది. భూమన ఛైర్మన్ అయ్యాక టీటీడీ నిధులు దుర్వినియోగమయ్యాయి. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఛైర్మన్ అయిన తర్వాత దేవస్థానం డబ్బుల్ని తన కొడుకు అభినవరెడ్డి ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక టీటీడీ సొమ్ము ప్రతి రూపాయి వసూలు చేస్తాం. తాడేపల్లి ప్యాలెస్‌లో సజ్జల ఎలాగో.. టీటీడీలో ధర్మారెడ్డి వ్యవహారం అలానే ఉంది. ధర్మారెడ్డి అవినీతిపై 14 సెక్షన్ల కింద దిల్లీలో క్రిమినల్ కేసు నమోదైంది. తనపై ఉన్న క్రిమినల్ కేసుని దాచిపెట్టి ధర్మారెడ్డి టీటీడీ ఈవో అయ్యాడు. క్రిమినల్ కేసులున్న వ్యక్తికి టీటీడీలో కీలక పదవి ఎలా ఇస్తారు? టీటీడీని అడ్డం పెట్టుకుని దిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారు. దిల్లీ కేసులో తీర్పు వచ్చేవరకు ధర్మారెడ్డిని టీటీడీ బాధ్యతల నుంచి తప్పించాలి." - ఆనం వెంకటరమణారెడ్డి, టీడీపీ అధికార ప్రతినిధి