Supreme Court Serious on AP Government : పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల నిర్మాణంలో పర్యావరణ ఉల్లంఘనలో విధించిన జరిమానాను రాష్ట్ర ప్రభుత్వం.. చెల్లించకపోవటంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. జరిమానా చెల్లించడమంటే ప్రభుత్వానికి ఇష్టమొచ్చినప్పుడు చేయటం కాదని సుప్రీం వ్యాఖ్యనించింది. రెండు వారాల్లోపు ఇచ్చిన ఆదేశాలను అమలు చేసి.. నివేదికను సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో పర్యావరణ ఉల్లంఘనలపై గత ఏడాది ఆక్టోబర్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు జరిమానా విధించింది. ఈ జరిమానాను ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించకపోవటంతో.. ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ ఈ రెండు ప్రాజెక్టుల్లో జరిమానా చెల్లింపుపై.. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనం ప్రభుత్వంపై అసంతృప్తిని వ్యక్తం చేసింది. జరిమానా చెల్లించటం అంటే ప్రభుత్వానికి ఇష్టమొచ్చినప్పుడు చెల్లించడానికి.. దానం చేయటం కాదని తీవ్రంగా మండిపడింది.
గతంలో వీటిపై విచారణలో భాగంగా.. నిపుణుల కమిటీని జాతీయ హరిత ట్రైబ్యునల్ నియమించింది. ట్రైబ్యునల్ నియమించిన కమిటీ రెండు ప్రాజెక్టులపై పూర్తి అధ్యయనం చేసి.. పురుషోత్తపట్నంకు 2.48 కోట్ల రూపాయలు, పట్టిసీమకు 1.90 కోట్ల రూపాయల జరిమానా విధించాలని హరిత ట్రైబ్యునల్‌కు సిఫారసు చేసింది. దీంతో ప్రాజెక్టుల వ్యయం ఆధారంగా.. 242 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ.. ఎన్జీటీ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఎన్జీటీ ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. అయితే రెండు ప్రాజెక్టులకు కలిపి 4.38 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాల్సిందేనని తేల్చి చెప్పింది. పర్యావరణ ఉల్లంఘనలను దృవీకరిస్తూ పురుషోత్తపట్నం ప్రాజెక్టుకు 2.48కోట్ల రూపాయలు, పట్టిసీమ ప్రాజెక్టుకు 1.90 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. ఈ మేరకు గత సంవత్సరం అక్టోబరులో సుప్రీం కోర్టు తీర్పును వెలువరించింది.
విధించిన జరిమానాను చెల్లించి.. రెండు వారాలలో నివేదిక సమర్పించాలని ప్రభుత్వానికి ధర్మాసనం తాజాగా ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోర్టు ఉత్వర్వులను అమలు చేయకపోతే.. విచారణ జరిగిన రోజే ఆదేశాలు జారీ చేస్తామని పేర్కోంది. పురుషోత్తపట్నం ప్రాజెక్టు నిర్వాసితులకు ఆరు సంవత్సరాల నుంచి పరిహారం చెల్లించలేదని.. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు ఉన్నత న్యాయస్థాన దృష్టికి తీసుకువచ్చారు. తదుపరి విచారణలో అని విషయాలను పరిశీలిస్తామని వ్యాఖ్యానించిన ధర్మాసనం.. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఇవీ చదవండి :