Student Micro Arts: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని.. బియ్యపు గింజలపై జాతీయ పతాకాన్ని.. చిరుధాన్యాలు, దారం వంటి వాటిపై దేశభక్తి గీతాలు చిత్రీకరిస్తోంది ఈ అమ్మాయి. ప్రతిభ, నైపుణ్యాలతో సరికొత్తగా ముందుకుసాగుతూ ప్రత్యేక గుర్తింపు పొందింది. పలువురి ప్రశంసలతో పాటు.. అవార్డులు, రికార్డులు అందుకుంటూ ఔరా అనిపిస్తోంది ఈ యువ కళాకారిణి.
సూక్ష్మ చిత్రలేఖనంలో రాణిస్తోన్న ఈ యువతి పేరు మౌల్య పద్మావతి. విజయవాడ గొల్లపాలెంగట్టుకు చెందిన సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. చిన్నప్పటి నుంచి చదువుతోపాటు చిత్రలేఖనంలో కూడా ఆసక్తి కనబరించింది. ప్రస్తుతం కేబీఎన్ కళాశాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో తోటి విద్యార్థులకు దేశభక్తి కల్గించే ప్రయత్నం చేస్తోంది.
AI Technology: ఆవిష్కరణల హేళ.. 'ఏఐ'తో భళా.. అద్భుతాలు సాధిస్తున్న ఇంజినీరింగ్ విద్యార్థులు
పద్మావతి 4వ తరగతి చదువుతున్న రోజుల్లో మచిలీపట్నం బీచ్‌కు తీసుకువెళ్లాడు తండ్రి శ్రీనివాస్. అక్కడ ఓ కళాకారుడు బియ్యం గింజపై పేర్లు రాస్తోంటే చూసి ఆకర్షితులైంది. తన పేరుతో కూడా రాయించుకొని ఇంటికి తీసుకువెళ్లింది. కానీ, అది కొన్ని రోజులకే కిందపడి పగిలిపోయింది. దాంతో మనస్తాపానికి గురైంది. మళ్లీ మచిలీపట్నం వెళ్లలేనుగనుక.. తనే ఆ కళాకృతిని రూపొందించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతోంది పద్మావతి.
చిత్రలేఖనంపై ఉన్న ఇష్టంతో ప్రత్యేక శిక్షణ తీసుకోకుండా సాధన చేసింది పద్మావతి. పట్టుదలతో సాధన చేస్తే సాధించలేనిదేది లేదని నిరూపిస్తూ.. బియ్యం గింజలపై పేర్లు రాయడం నేర్చుకుంది. ఈ క్రమంలోనే వేల బియ్యపు గింజలపై రామాయణ కథ రాసి.. నువ్వుల గింజలపై జాతీయ జెండాను గీసి అందరిని ఔరా అనిపించింది.
బియ్యపు గింజలపై రామాయణాన్ని రాయడంతో పద్మావతి వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డును సాధించింది. ప్రధాని మోదీ జీవిత చరిత్రను రాసినందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సొంతం చేసుకుంది. ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపేందుకు వినుత్నంగా దారం, చిరుధాన్యాలు, సేమియాలు వంటి వాటిపై జాతీయ జెండా, జనగణమణ, వందేమాతరం వంటి వాటిని లిఖించింది పద్మావతి.
రామాయణంలోని ఆరు కాండల సారాంశాన్ని చిన్నచిన్న వాక్యాలుగా చేసి.. ఒక్కో గింజ మీద సుమారు 20 అక్షరాల వరకు రాస్తూ మొత్తం రామాయణాన్ని పూర్తి చేసింది పద్మావతి. చిత్రలేఖనంపై ఉన్న ఆసక్తి, ఉత్సాహాన్ని గుర్తించి అమ్మానాన్నలు ఎంతో ప్రోత్సహించారని చెబుతోంది. ఉపాధ్యాయులు, మిత్రులు కూడా వెన్నుదన్నుగా ఉంటారని, అందరి ప్రోత్సాహమే తనను ఈ స్థాయికి తీసుకువచ్చిందని అంటుంది.
తన సాధించిన కళానైపుణ్యాలు తోటి విద్యార్థులకు నేర్పిస్తోంది పద్మావతి. తద్వారా తన విద్యకు కావాల్సిన ఆర్థిక వనరులను తానే సమకూర్చుకుంటుందని తల్లిదండ్రులు చెబుతోన్నారు. తమ కుమార్తె ఈ కళలో రాణించడం ఆనందంగా ఉందని వారు అంటున్నారు.
వినూత్నరీతిలో జాతీయ గీతాలను చిత్రీకరించి అందరిని ఆబ్బురపరుస్తోంది పద్మావతి. సాధన చేస్తూ ఉంటే సాధ్యం కానిది ఏది లేదని నిరుపిస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా బియ్యం గింజలపై వందేమాతరం, జనగణమణ గేయాలను లిఖించింది. భవిష్యత్‌లో ఫ్యాషన్ డిజైనర్ కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు చెబుతోంది ఈ యువ కళాకారిణి..