Central On EWS Reservations: సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రాలకు ఉందని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలిపింది. కాపులకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో అయిదు శాతం వాటా ఇస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన చట్టం చెల్లుబాటు అవుతుందా అని బీజేపీ సభ్యుడు జి.వి.ఎల్. నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర సామాజిక న్యాయ, సాధికారిత శాఖ సహాయ మంత్రి ప్రతిమా బౌమిక్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉందని మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు. 103 రాజ్యాంగ సవరణ చట్టం-2019 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించే అధికారం కేంద్రం కల్పించిందని కేంద్ర మంత్రి వివరించారు. 2021లో చేసిన 105వ రాజ్యాంగ సవరణ ప్రకారం సామాజికంగా, ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం సొంత జాబితాను తయారు చేసుకోవచ్చని.... కేంద్రం, రాష్ట్రాలు సొంతంగా ఎస్ఈబీసీ జాబితా రూపొందించుకోవచ్చని మంత్రి లిఖితపూర్వక సమాధానంలో స్పష్టం చేశారు.
ఇవీ చదవండి