State Government Orders: ప్రైవేట్ లేఔట్లలో 5 శాతం భూమిని ప్రభుత్వానికి కేటాయించే విధానాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈమేరకు.. సవరణ జీవో 145ను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పట్టణ ప్రాంతాల్లోని లేఔట్లలో 5 శాతం పేదల ఇళ్ల నిర్మాణానికి ఇవ్వాలంటూ గతంలో రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబరు 145 ను జారీ చేసింది. ప్రైవేటు లేఔట్లలో 5 శాతం భూమి కేటాయింపుపై రియల్ ఎస్టేట్ వర్గాలు, వ్యక్తుల నుంచి వచ్చిన వేర్వేరు వినతుల్ని పరిగణనలోకి తీసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను నిలుపుదల చేసింది.
ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ లేఔట్లలోని మొత్తం స్థలంలో 5 శాతం భూమిని ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వు చేసేలా 2021లో రాష్ట్ర ప్రభుత్వం 145 జీవోను జారీ చేసింది. సదరు 5 శాతం స్థలాన్ని రిజర్వు చేసి కలెక్టర్లకు అప్పగిస్తే తప్ప లేఔట్ల అనుమతి మంజూరు కాకుండా ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించాలంటూ వచ్చిన విజ్ఞప్తుల మేరకు జీవో నెంబరు 145ను వెనక్కు తీసుకుంటూ పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో నెంబరు 13ను జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని జీవోలో ప్రభుత్వం పేర్కోంది.
ఇవీ చదవండి: