AP SC Sub Plan Funds latest news: ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగానికి సంబంధించి.. 2023 ఫిబ్రవరి నాటికి ఎంత ఖర్చులు అయ్యాయనే వివరాలను..రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై ఆయన ఈరోజు అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా ఆయన వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. అనంతరం సబ్ ప్లాన్ నిధుల వినియోగానికి సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు.
2023 ఫిబ్రవరి నాటికి 70.81శాతం నిధులు ఖర్చు: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ సబ్ ప్లాన్ కింద కేటాయించిన రూ.18518.29 కోట్లలో 2023 ఫిబ్రవరి నాటికి 70.81శాతం నిధులు ఖర్చు అయ్యాయని.. మంత్రి మేరుగు నాగార్జున తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై నేడు విజయవాడలో జరిగిన 30వ నోడల్ ఏజెన్సీ సమావేశంలో పాల్గొన్న మంత్రి.. సబ్ ప్లాన్ నిధుల వినియోగంపై వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. ఈ సమీక్షకు దాదాపు 43 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.
అదనపు బడ్జెట్‌తో మొత్తం రూ.20605.44 కోట్లకు చేరింది: ఈ సందర్భంగా రాష్ట్రంలోని కొన్ని శాఖలు సబ్ ప్లాన్ ద్వారా తాము ప్రతిపాదించిన పనుల కోసం అదనపు బడ్జెట్ కావాలని కోరడం, ప్రభుత్వం ఆ విధంగానే అదనపు బడ్జెట్‌ను కేటాయించడంతో ఈ మొత్తం రూ.20605.44 కోట్లకు చేరిందని అధికారులు తెలిపారు. సబ్ ప్లాన్ నిధుల వినియోగం విషయంలో కొన్ని శాఖలు అంచనాలకు మించి ప్రగతిని సాధిస్తుండగా.. కొన్ని శాఖలు మాత్రం వెనుకబడి ఉన్నాయని గుర్తించామన్నారు.
గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగం: అనంతరం 76శాతం నుంచి 100శాతం నిధులను వినియోగించిన శాఖలు ఏ-గ్రేడ్ గాను, 51శాతం నుంచి 75శాతం దాకా నిధులను వినియోగించిన శాఖలను బీ-గ్రేడ్ గానూ, 26శాతం నుంచి 50శాతం దాకా నిధులను వాడుకున్న శాఖలను సీ-గ్రేడ్ గాను, 25శాతం వరకూ మాత్రమే నిధుల వినియోగం ఉన్న శాఖలను డీ-గ్రేడ్‌గా గుర్తించామని, ఈ గ్రేడ్ల ఆధారంగానే సబ్ ప్లాన్ నిధుల వినియోగాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించడం జరుగుతుందని మంత్రి నాగార్జున వివరించారు.
పలు శాఖల పనితీరు బాగుంది: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన సబ్ ప్లాన్ నిధుల్లో రూ.13112.36 కోట్లు ఫిబ్రవరి మాసాంతానికి ఖర్చు అయ్యాయని ఆయన వెల్లడించారు. సబ్ ప్లాన్ నిధుల్లో అత్యధిక శాతం ఖర్చు చేసిన విద్యుత్, సివిల్ సప్లయిస్, ప్రజారోగ్యం, పరిశ్రమలు, వైద్య విద్య, ఎస్సీ గురుకులాలు, రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, భూ పరిపాలన, వ్యవసాయం, బలహీనవర్గాల గృహ నిర్మాణం, పంచాయితీరాజ్ తదితర శాఖల పనితీరును బాగుందని ప్రశంసించారు.
నిధులను క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేదు: నిధుల వినియోగంలో వెనుకబడిన శాఖల పనితీరును మెరుగుపర్చుకోవాలని మంత్రి మేరుగు నాగార్జున సూచించారు. సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో వినియోగించుకోని నిధులను మరొక ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసే అవకాశం లేదని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఈ కారణంగానే సబ్ ప్లాన్ ద్వారా కేటాయించిన నిధుల్లో ప్రతి రుపాయి కూడా ఎస్సీల ప్రగతికి ఉపయోగపడేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఇవీ చదవండి