ఈ నెల 18న మహా శివరాత్రి సందర్భంగా.. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లకు.. విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాదేవి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. దుర్గాదేవి ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు దంపతులు, ఆలయ ఈవో భ్రమరాంబ పట్టువస్త్రాలు సమర్పించారు. శ్రీశైల దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో వీరికి స్వాగతం పలికారు. వేదపండితులు ఆశీర్వచనము అందించారు. శ్రీశైలం ఈవో లవన్న స్వామివార్ల చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదములు వీరికి అందజేశారు.
శ్రీశైలం బ్రహ్మోత్సవాలు : ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలంలో శనివారం నుంచి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాలకు భక్తులు భారీగా చేరుకుంటున్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. అంతేకాకుండా భారీగా నల్లమల్ల అడవుల గుండా భక్తులు పాదయాత్ర చేస్తూ శ్రీశైలానికి చేరుకుంటున్నారు. శ్రీశైలంలో భక్తులందరికీ ఆలయ అధికారులు మౌలిక వసతులను, కనీస సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తులకు సులువుగా మల్లికార్జున స్వామి వారి అలంకార దర్శనం జరిగేలా సిబ్బంది ఏర్పాట్లు చేశారు. పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలానికి చేరుకునే భక్తులకు శీఘ్ర దర్శనం క్యూలైన్లో అనుమతి ఇస్తున్నారు.
ఇవీ చదవండి :