Service Roads at Vijayawada Highway conditions విజయవాడ నగర పరిధిలోని పలు రహదారుల్లో నిర్మాణ లోపాలు, మలుపులు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఏటా పెద్ద సంఖ్యలో గాయాలబారిన పడుతున్నారు. విజయవాడ నగరంలో ప్రమాదాలకు కారణాలను అధికారులు గుర్తించినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు మారడం లేదు. ఈ మార్గంలో నిత్యం నాలుగైదు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రవాణా, జాతీయ రహదారుల విభాగాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి లోపాలను సరిచేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారిపై సర్వీసు రోడ్లు లేకపోవడంతో... ట్రాఫిక్ సమస్యలు పెరగడంతోపాటు ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. నగర శివారు ప్రాంతాల్లో జనాభా బాగా పెరిగింది. కానూరు మొదలు తాడిగడప, పోరంకి, పెనమలూరు, గంగూరు, ఈడ్పుగల్లు, గోశాల, కంకిపాడు, ఉయ్యూరు వరకు అనేక కాలనీలు రోడ్డుకు రెండు వైపులా విస్తరించాయి. అవసరాలకు అనుగుణంగా సర్వీసు రోడ్లు, అండర్‌పాస్‌లను నిర్మించలేదు. ఈ ప్రాంతాల ప్రజలు నేరుగా జాతీయరహదారిపైకి రావాల్సి వస్తుండటంతో... తరచుగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అలాగే చెన్నై-కోల్‌కతా జాతీయరహదారిలో... ఏలూరు వైపు రామవరప్పాడు వరకే సర్వీసు రోడ్డు ఉంది. ఆ తర్వాత లేకపోవడంతో.. స్థానికులు జాతీయరహదారిపైనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. దీని వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. బెంజి సర్కిల్ వంతెన పైనుంచి వచ్చే వాహనాలు, కింద నుంచి వచ్చేవి కలిసే చోట ఇరుకుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కనకదుర్గ వంతెన భవానీపురం వద్ద ముగిసే చోట... పై నుంచి వచ్చే వాహనాలు, అప్రోచ్ నుంచి వచ్చే వాహనాలు తరచూ ఢీకొంటున్నాయి.
జిల్లా నుంచి ఎన్‌హెచ్ 65, 16తోపాటు రాష్ట్ర రహదారులు వెళుతున్నాయి. నగర కమిషనరేట్ పరిధిలో వందకు పైగా బ్లాక్‌స్పాట్లు ఉన్నట్లు తేల్చారు. రామవరప్పాడు, శ్రీశక్తి కల్యాణ మండలం, ఎస్‌ఆర్‌కే కళాశాల, కేసరపల్లి, గూడవల్లి, నిడమానూరు, తేలప్రోలు, వీరవల్లి కూడళ్లతోపాటు చిన్నఅవుటపల్లి మలుపు అత్యంత ప్రమాదకరంగా మారాయని నిపుణులు గుర్తించారు. హైదరాబాద్-మచిలీపట్నం జాతీయ రహదారిలోని పలు ప్రాంతాలు ప్రమాదాలకు కేంద్రాలుగా మారాయి. హైదరాబాద్- మచిలీపట్నం వెళ్లే బందరు రోడ్డులో వేలాది వాహనాల తాకిడి ఉంటున్నా.. సర్వీసు రోడ్డు లేక ప్రమాదాల బారిన పడుతున్నారు. పెరిగిన వాహనాల రద్దీకి తోడు రహదారిని విస్తరించకపోవడంతో ఈ సమస్య ఏర్పడింది.
రహదారులపై జరుగుతున్న ప్రమాదాల్లో 60 శాతం... నిర్మాణంలో లోపాల వల్లే జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు . రహదారులు కొన్ని చోట్ల ఇరుకుగా ఉండటం, ఒంపుగా ఉండటం, సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, వేగ నిరోధకాలు లేకపోవడం వంటి కారణాలతో దుర్ఘటనలు జరుగుతున్నాయి.. నగరంలోని రోడ్లను అక్కడక్కడా బాగు చేసినా.. చాలా చోట్ల అలాగే ఉన్నాయి. వీటిని బాగు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదాలకు కారణాలు గుర్తించిన అధికారులు, నిపుణులు... నివారణకు సరైన చర్యలు చేపట్టడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆ దిశగా చర్యలు చేపట్టాలని విజయవాడ ప్రజలు కోరుతున్నారు.