ఎన్టీఆర్ జిల్లా నందిగామ నగర పంచాయతీలో అధికార వైకాపా కౌన్సిలర్లు.. పార్టీ అధిష్టానం పట్ల అసంతృప్తితో తిరుగుబాటు జెండా ఎగురవేశారు. వైకాపా నుంచి ఎన్నికైన 13 మంది కౌన్సిలర్లలో 10 మంది కౌన్సిలర్లు వేరుకుంపటి పెట్టారు. తమ హక్కుల సాధన కోసం ఏకంగా ముఖ్యమంత్రినైనా ఎదురిస్తామని తేల్చి చెప్పారు. తమ అధికారాలను కాలరాసి.. ఉత్సవ విగ్రహాల మాదిరి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
నందిగామ నగర పంచాయతీ ఛైర్ పర్సన్ వరలక్ష్మీ ఆనారోగ్యంతో చికిత్స పొందుతోంది. దాంతో అమె స్థానంలో ఇన్‌ఛార్జి ఛైర్ పర్సన్‌గా నాగరత్నంను ఎంపిక చేశారు. ఈ విషయంలో తమను ఎవరు సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారని 10 మంది కౌన్సిలర్లు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి ఇన్‌ఛార్జి ఛైర్ పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన రోజు కూడా ఎలాంటి సమాచారమివ్వలేదన్నారు. అంతే కాకుండా ఏడాది కాలంగా తమ వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల విషయంలోనూ తమకు ఎటువంటి భాగస్వామ్యం కల్పించలేదన్నారు. అందుకే తాము తమ హక్కుల సాధన కోసం కలిసికట్టుగా ఉండి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
తాజాగా సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశానికి 10 మంది కౌన్సిలర్లు గైర్హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వారి కోసం ఎంతగా ప్రయత్నించినప్పటికీ వారు అందుబాటులోకి రాలేదు. అజ్ఞాతంలో ఉన్న కౌన్సిలర్లు సమావేశం నిర్వహించుకొని.. అందరం కలిసే పయనించాలని నిర్ణయం తీసుకున్నారు. విలువ లేని పదవుల్లో ఉండటం కన్నా.. ఆత్మాభిమానంతో ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'చంద్రబాబు ఎవరితో పొత్తుపెట్టుకున్నా.. వైకాపాను ఓడించలేరు'