Revanth Reddy Padayatra: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 6న భద్రాచలం నుంచి పాదయాత్ర మొదలు పెడుతున్నట్లు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తాను చేపట్టే పాదయాత్ర రెండు నెలల పాటు కొనసాగుతుందని తెలిపారు. టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో.. పాదయాత్రతో పాటు ఈ నెల 26నుంచి చేపట్టే హాథ్ సే హాథ్ జోడో యాత్ర ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ యాత్రలో ఏదో ఒక రోజు ప్రియాంక గాంధీ లేకపోతే సోనియాగాంధీ పాల్గొనేలా తీర్మానం చేస్తున్నామని చెప్పారు. గాంధీభవన్‌లో నిర్వహించిన ఓ సమావేశం అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇక నుంచి ఠాక్రే హజరయ్యే సమావేశాలకు మూడు సార్లు రాకపోతే ఎందుకు రాలేదో వివరణ తీసుకుంటామని రేవంత్‌రెడ్డి వివరించారు. కీలక సమయాల్లో.. సమావేశానికి రాని వారిని పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సీనియర్ నేత నాగం జనార్ధన్‌రెడ్డిపై అధికార పార్టీ నేతలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. అక్రమ కేసులపై డీజీపీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. నాగర్ కర్నూల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ సభ నిర్వహిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు.
దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్: రాహుల్ గాంధీ ఈ నెల 30వ తేదీన శ్రీనగర్‌లో జాతీయజెండా ఎగురవేస్తారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. భద్రతా కారణాలు చూపి జనవరి 26న ఆయనను శ్రీనగర్‌లో జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. దేశ సమగ్రతను కాపాడేది కాంగ్రెస్ అని.. ప్రజలకు రాహుల్ గాంధీ నమ్మకం కలిగించారని తెలిపారు. దీనిపై బీజేపీ చిల్లర ఆరోపణలు చేస్తుందని రేవంత్‌రెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు
అంతకుముందు గాంధీభవన్‌లో టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై పాదయాత్ర చేయాలంటూ పలువురు నేతల నుంచి డిమాండ్ వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పాదయాత్ర చేస్తునే.. కాంగ్రెస్ పార్టీ బతుకుతుందని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ పేర్కొనారు. ప్రస్తుతం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని మాజీ మంత్రి కొండా సురేఖ వివరించారు.
పాదయాత్ర రూపంలో వెళ్తే కాంగ్రెస్‌కు మంచి రోజులు: ఎవరూ పాదయాత్ర చేసినా భద్రాచలం నుంచే జనంలోకి పాదయాత్ర రూపంలో వెళ్తే కాంగ్రెస్‌కు మంచి రోజులని మాజీ మంత్రి కొండా సురేఖ తెలిపారు. పీసీసీ లేదా సీఎల్పీ కానీ లేదా ఇద్దరు కలిసైనా పాదయాత్ర చేయాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య కోరారు. ఎవరూ పాదయాత్ర చేసినా భద్రాచలం నుంచే మొదలు పెట్టాలని ఆయన కోరారు. మాజీ మంత్రి గీతారెడ్డి కూడా పాదయాత్ర చేయాల్సిన అవసరం ఉందంటూ నొక్కి చెప్పారు.
తానెవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదు: ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హాథ్ సే హాథ్ జోడో యాత్రను ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మాణిక్ రావు థాక్రే స్పష్టం చేశారు. అంత ఐక్యంగా పనిచేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలువడం.. అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు. తానెవరికి అనుకూలం.. వ్యతిరేకం కాదని అలాంటి ఆలోచన పక్కన పెట్టాలని నేతలకు సూచించారు. అధిష్ఠానం చెప్పింది చేయడమే తన విధిగా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి 50 నియోజకవర్గాలకు తగ్గకుండా యాత్ర చేస్తారని.. మిగిలిన సీనియర్లు కూడా 20,30 నియోజకవర్గాల్లో యాత్ర చేయాలని మాణిక్ రావు థాక్రే స్పష్టం చేశారు.
"ఈనెల 26న హాథ్ సే హాథ్ జోడో యాత్రను లాంఛనంగా ప్రారంభిస్తాం. ప్రియాంక లేదా సోనియాగాంధీ ఒక రోజు యాత్రలో పాల్గొనేలా తీర్మానం చేశాం. ఫిబ్రవరి 6 నుంచి రెండు నెలల పాటు పాదయాత్ర మొదలవుతుంది. భద్రాచలం నుంచి నేను యాత్ర మొదలు పెడతా. థాక్రే సమావేశానికి 3 సార్లు రానివారి నుంచి వివరణ తీసుకుంటాం. కీలక సమావేశాలకి హాజరుకానివారిని పార్టీ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటా. - రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు
ఇవీ చదవండి: