Large Numbers Of Bogus And Duplicate Votes:శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున బోగస్, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు వచ్చినా ఎన్నికల సంఘం వాటిని పూర్తిగా తొలగించలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తుది జాబితాలోనూ పెద్దసంఖ్యలో బోగస్ ఓటర్లు కొనసాగుతున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. వైసీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పడంతో నిరక్షరాస్యులు సహా 3, 5, 10, ఇంటర్ విద్యార్హతలున్నవారినీ పట్టభద్రులేనంటూ వాలంటీర్లు దరఖాస్తు చేయించారనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ.
డూప్లికేట్ ఓట్లు..తొలగించని ఎన్నికల సంఘం
3 పట్టభద్రుల, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్‌కుమార్ మీనా విడుదల చేశారు. శాసనమండలి పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో పెద్ద ఎత్తున బోగస్, డూప్లికేట్ ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదులు, అభ్యంతరాలు వచ్చినా ఎన్నికల సంఘం వాటిని పూర్తిగా తొలగించలేదు. ఒకే వ్యక్తి పేరు ఎక్కువ సార్లు ఉన్న డూప్లికేట్ ఓట్లను కూడా పూర్తిగా తీయలేకపోయింది. భారీగా చేర్పించిన బోగస్ ఓట్లనూ పూర్తిస్థాయిలో తొలగించలేదు. అదే సమయంలో భారీగా కొత్త ఓట్లు చేర్చింది. దీంతో తుది జాబితాలోనూ పెద్దసంఖ్యలో బోగస్ ఓటర్లు కొనసాగుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు ఈ నెల 9న ఎన్నికల సంఘం గుర్తించింది
ముసాయిదా జాబితాతో పోలిస్తే పట్టభద్రుల నియోజకవర్గాల పరిధిలో 30,553 మందిని తొలగించారు. లక్షా 27 వేల 666 మందిని కొత్తగా చేర్చారు. ఉపాధ్యాయ నియోజకవర్గాల పరిధిలో 1,396 మందిని తొలగించి 12,907 మందిని కొత్తగా చేర్చారు. మొత్తంగా పట్టభద్ర ఓటర్లు 9,96,393 మంది, ఉపాధ్యాయ ఓటర్లు 54,681 మంది ఉన్నట్లు ప్రకటించారు. పట్టభద్రుల నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాలో 42,540 మంది డూప్లికేట్ ఓటర్లు ఉన్నట్లు ఈ నెల 9న ఎన్నికల సంఘం గుర్తించింది. కానీ తుది జాబితాలో 30,553 ఓట్లే తొలగించింది. మిగతా 11,987 ఓట్లు ఎందుకు తొలగించలేదనే ప్రశ్నకు సమాధానం లేదు.
ఎలాగైనా జగనన్న రుణం తీర్చుకోవాలి
పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేయించాలి. వైసీపీ అభ్యర్థులను గెలిపించి జగనన్న రుణం తీర్చుకోవాలంటూ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు చెప్పడంతో నిరక్షరాస్యులు సహా 3, 5, 10, ఇంటర్ విద్యార్హతలున్నవారినీ పట్టభద్రులేనంటూ వాలంటీర్లు దరఖాస్తు చేయించారనేది ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ. ఒకరి పేరుతోనే నాలుగైదు దరఖాస్తులు పెట్టినా ఎలాంటి పరిశీలన లేకుండా అన్నింటికి తుదిజాబితాలో చోటు దక్కాయనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.
ఇవీ చదవండి