Real Estate Sales Demand Decreased in AP: రాబోయే ఎన్నికల దృష్ట్యా స్థిరాస్తి రంగంలో స్తబ్దత నెలకొంది. విశాఖ జిల్లాలో మినహా మిగిలిన జిల్లాల్లో ఆస్తుల క్రయ, విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎన్నికల అనంతరం వచ్చే ప్రభుత్వ ఆలోచనలు ఎలా ఉంటాయో, ఏయే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయోనన్న దానిపై స్పష్టత వచ్చాక.. క్రయవిక్రయాలు సాగించాలన్న ఆలోచనలో చాలా మంది ఉన్నారు. దీంతో రిజిస్ట్రేషన్‌లు మందగించాయి. గతేడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య జరిగిన వాటితో ఇదే సమయానికి పోలిస్తే డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్‌లు 22.81 శాతం వరకు తగాయి. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 39.4 శాతం రిజిస్ట్రేషన్‌లు తగ్గగా.. విశాఖలో మాత్రమే రిజిస్ట్రేషన్‌లు 14.33 శాతం పెరిగాయి.
వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రిజిస్ట్రేషన్ శాఖలో 6 సార్లు రకరకాల సేవా రుసుములు పెరిగాయి. ఈ ఏడాది జూన్ 1 నుంచి ఆయా ప్రాంతాల డిమాండ్‌ను బట్టి భూముల మార్కెట్ విలువలను 30 నుంచి 75శాతం వరకు రాష్ట్ర ప్రభుత్వం పెంచేసింది. ఆస్తుల కొనుగోలు వ్యయానికి అదనంగా పెరిగిన రుసుముల భారం కూడా రిజిస్ట్రేషన్‌లపై కనిపిస్తుంది. వివిధ ప్రాంతాల అభివృద్ధి అనుసరించి ఆస్తుల క్రయవిక్రయాలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో త్వరలో జరిగే ఎన్నికల ద్వారా అధికారంలోనికి వచ్చే ప్రభుత్వ వైఖరి అనుసరించి భూమి కొనుగోలుపై నిర్ణయాన్ని తీసుకుంటామని చాలా మంది చెబుతున్నారు.
బ్యాంకుల రుణాలతో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసేవారు కూడా ప్రస్తుతం వేచిచూస్తున్నారు. తాజాగా బ్యాంకులు గృహ రుణాలపై వడ్డీని 1.5 నుంచి 2 శాతం వరకు పెంచాయి. దీనివల్ల బ్యాంకులు నుంచి రుణాలు పొందే మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారం పెరిగింది. ఈ పరిస్థితుల్లో తీసుకున్న రుణానికి తగ్గట్లు కొనుగోలు చేసిన ఆస్తుల విలువలు పెరగకుంటే.. ఆర్థికంగా నష్టపోతామన్న ఆందోళనతోనూ కొందరు సంయమనం పాటిస్తున్నారు. అదే విధంగా ఎన్నికల తరువాత ధరలు కాస్త పెరుగుతాయన్న ఉద్దేశంతోనూ ఫ్లాట్ల విక్రయదారులు తొందర పడటం లేదు. ప్రతి ప్రాంతంలోనూ ఇలాంటి ధోరణే కనిపిస్తుంది.
ప్రస్తుతం పట్టణాలు, నగరాలకు సమీపంలో ఉన్న ప్రాంతాల్లోనే రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అభివృద్ధి దృష్ట్యా.. కొందరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్లాట్లు కొంటున్నారు. ఇలా వివిధ కారణాలతో రిజిస్ట్రేషన్‌లు తగ్గుముఖం పట్టాయి. గత 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు నమోదైన రిజిస్ట్రేషన్‌లతో పోల్చితే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రిజిస్ట్రేషన్ శాఖ రికార్డుల్లో ఉన్న జిల్లాల వారీగా పరిశీలిస్తే.. నెల్లూరు జిల్లాలో 39.04 శాతం, కోనసీమలో 34.94, రాజమహేంద్రవరంలో 34.72, మన్యంలో 32.91, శ్రీకాకుళం జిల్లాలో 30.40 శాతం చొప్పున రిజిస్ట్రేషన్‌లు తగ్గాయి.
కరిగిపోయిన స్థిరాస్థి కల.. ఏపీలో ఇలా.. తెలంగాణలో అలా..!
ఇదే క్రమంలో.. రాయచోటి, భీమవరం, చిత్తూరు, తిరుపతి, నంద్యాల, విజయనగరం, నరసరావుపేట, బాపట్ల, కర్నూలు , అనకాపల్లి జిల్లాల్లో 29.19 నుంచి 20.18 శాతం మధ్య రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి. అనంతపురం, కడప, గుంటూరు, విజయవాడ, ఏలూరు, మచిలీపట్నం, పుటపర్తి, ప్రకాశం జిల్లాల్లో 19.15 నుంచి 12.36 శాతం మధ్య రిజిస్ట్రేషన్‌లు రికార్డయ్యాయి. ప్రతి జిల్లాలో రిజిస్ట్రేషన్‌లు తగ్గుతున్నాయి కానీ పెరుగుదల కనిపించలేదు. ఇందుకు భిన్నంగా విశాఖ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు ప్రతినెలా పెరుగుతూ వచ్చాయి. జులైలో ఏకంగా 55.35%, ఆగస్టులో 27.75% చొప్పున రిజిస్ట్రేషన్‌లు పెరిగాయి.
గత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 12,78,700 రిజిస్ట్రేషన్‌లు జరిగాయి. ఈ ఏడాది ఇదే సమయానికి కేవలం 9,86,997 రిజిస్ట్రేషన్‌లు పూర్తయ్యాయి. అంటే 22.81 శాతం మేర క్రయవిక్రయాలు తక్కువగా జరిగాయి. రాజధానిపై అయోమయం, రాజకీయ అనిశ్చితి, రానున్న ఎన్నికల కారణంగా రిజిస్ట్రేషన్‌లు తగ్గుముఖం పట్టాయని.. నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానాల వల్ల కూడా క్రయవిక్రయాలకు ప్రజలు ఆసక్తి చూపడం లేదని అంటున్నారు.
real estate cheatings: ఇళ్లు, స్థలం కొంటున్నారా?.. అప్రమత్తమవండి!